రాజ్యసభలో రెండు కశ్మీర్ బిల్లుల (jammu Kashmir Bills)ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఈ రోజు ప్రవేశ పెట్టారు. జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ)బిల్లు-2023, జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ (సవరణ)బిల్లు-2023లకు ఇప్పటికే లోక్ సభ ఆమోదం తెలిపింది. తాజాగా పెద్దల సభలో అనుమతి కోసం ఈ బిల్లులను రాజ్యసభలో కేంద్రం ప్రవేశ పెట్టగా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఈ బిల్లులకు వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి మద్దతు తెలిపారు. తమ పార్టీ, సీఎం జగన్ కూడా ఈ బిల్లులకు మద్దతుగా ఉన్నారని చెప్పారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి నెహ్రూవియన్ సూడో సెక్యులరిజం అడ్డుగా ఉందని మండిపడ్డారు. ఆర్టికల్ 370, పాకిస్తాన్‌తో రెండవ యుద్ధంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి పొందడంలో విఫలమవడాన్ని కాంగ్రెస్ చేసిన తప్పిదాలుగా ఆయన అభివర్ణించారు.
పరిస్థితిని సరిదిద్దడానికి బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత అవకాశం వచ్చిందని, సిమ్లా డిక్లరేషన్ పై సంతకం చేసే సమయంలో ఆ అవకాశాన్ని కోల్పోయామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలుగా తాను భావించిన వాటిని కేంద్ర హోం మంత్రి ప్రస్తావించారన్నారు. ఈ విషయంలో అమిత్ షాను ఆయన ప్రశంసించారు. ఎన్నికలు జరగని పీఓకేలోని 24 స్థానాలకు సభ్యులను నామినేట్ చేయాలని ఆయన ప్రతిపాదించారు.
కశ్మీర్‌లో వలసదారులకు నగదు సహయాన్ని మరింత పెంచాలన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుండి జమ్మూ కశ్మీర్ గణనీయమైన పురోగతిని సాధించిందని వెల్లడించారు. జమ్ము కశ్మీర్ కు సంబంధించి జవహర్‌లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు తీవ్రమైన పరిణామాలకు దారితీశాయని పేర్కొన్నారు. అవి చాలా ‘పెద్ద తప్పిదాలు’గా ఆయన పేర్కొన్నారు.