బీజేపీపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) సంచలన ఆరోపణలు చేశారు. టైలర్ కన్నయ్యలాల్ (Kanhaiya Lal) హత్య కేసు నిందితులకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ నెల 25న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు గుప్పించారు.
కన్నయ్యలాల్ హత్య గురించి తెలియగానే తన కార్యక్రమాలన్నింటినీ వెంటనే రద్దు చేసుకున్నానని చెప్పారు. వెంటనే ఉదయ్ పూర్ వెళ్లి ఘటన గురించి తెలుసుకున్నానన్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం విషయం గురించి తెలిసినప్పటికీ కఉదయ్ పూర్ వెళ్లకుండా హైదరాబాద్ లోని ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారన్నారు.
ఘటన జరిగిన వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)దర్యాప్తు మొదలు పెట్టిందన్నారు. ఇప్పటి వరకు ఎన్ఐఏ ఎలాంటి చర్యలు తీసుకుందో ఎవరికీ తెలియదన్నారు. ఎన్ఐఏ బదులు రాష్ట్రానికి చెందిన ఎస్ఓజీ పోలీసులు దర్యాప్తు చేపట్టి ఉంటే ఇప్పటికే నిందితులకు శిక్షలు పడేవన్నారు.
నిందితులకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. కన్నయ్యలాల్ హత్యకు ముందు నిందితులు మరో కేసులో అరెస్టయ్యారని చెప్పారు. దీంతో నిందితులను ఆ కేసులో విడిపించేందుకు బీజేపీ నేతలు పోలీసు స్టేషన్ కు వెళ్లారన్నారు. చివరకు నిందితులను పోలీసు స్టేషన్ నుంచి విడిపించారన్నారు.
గతేడాది బీజేపీ నేత నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ ప్రవక్త గురించి ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలకు మద్దతు తెలిపారన్న ఆరోపణలపై ఉదయ్ పూర్ లోని టైలర్ కన్నయ్యలాల్ ను ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. అప్పట్లో ఈ హత్య సంచలనం రేపింది.