సనాతన ధర్మం గురించి తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్(Udayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు ఇంకా తీవ్ర దుమారాన్ని రేపుతునే ఉన్నాయి. సనాతన ధర్మం అనేది డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చి తీవ్ర విమర్శల పాలయ్యారు. సనాతన ధర్మం పై ఉదయ నిధి చేసిన వ్యాఖ్యల పై హిందూ , బీజే(BJP) నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ క్రమంలోనే ఇటీవల సామాజిక వివక్షపై తమిళనాడు గవర్నర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఉదయనిధి స్టాలిన్.. దాన్ని నిర్మూలించాలంటే సనాతన ధర్మాన్ని నాశనం చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో మరోసారి తీవ్ర దుమారం రేగింది.అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి.. తమిళనాడులో సామాజిక వివక్ష చాలా ఎక్కువగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో సామాజిక వివక్ష ఎక్కువగా ఉందని ఆర్ ఎన్ రవి ఆరోపించారు.
అయితే గవర్నర్ ఆర్ ఎన్ రవి చేసిన వ్యాఖ్యలపై తాజాగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సమాజంలో అంటరానితనం, అస్పృశ్యత, సామాజిక వివక్షను రూపుమాపాలంటే.. అన్నిటికంటే ముందు సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సి ఉంటుందని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగానే ఒకవేళ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తే.. అప్పుడు అంటరానితనం, అస్పృశ్యత కూడా నాశనం అవుతుందని తాను భావిస్తున్నట్లు ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు.
అయితే అంతకుముందు సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కరోనా వైరస్ లాంటిదని.. ఇలాంటి వాటిని కేవలం వ్యతిరేకిస్తేనే సరిపోదని.. దాన్ని నిర్మూలించేవరకు వదిలిపెట్టకూడదని సూచించారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన మద్రాస్ హైకోర్టు.. రాజ్యంగంలో పౌరులకు కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది విద్వేషపూరితం కాకూడదని సూచించింది.
ముఖ్యంగా మతానికి సంబంధించిన అంశాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ, హిందూ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు, బెదిరింపులు వచ్చాయి. అయినప్పటికీ ఉదయనిధి స్టాలిన్ మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు.
కుల వివక్ష లేకుండా అందరికీ అన్నీ దక్కాలన్నదే ద్రావిడ మోడల్ ఉద్దేశమని స్టాలిన్ తెలిపారు. ఈ వ్యవహారంలో తనపై ఎలాంటి కేసులు వేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే బీజేపీ, డీఎంకే మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది.