తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రారంభించిన శ్రీవాణి ట్రస్టు (Srivani Trust)కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పల్లెల్లోని బడుగు వర్గాల కాలనీల్లో ఆలయాలు (Temples) నిర్మించడం, అర్చకులకు కనీస వేతనాలు చెల్లించడం…. ఆలయాల్లో ధూపదీప నైవేద్యం కోసం నిధులు కేటాయింపు వంటి కార్యక్రమాల కోసం 2018లో టీటీడీ శ్రీవాణి పథకాన్ని ప్రారంభించింది.
తొలుత ఈ పథకానికి ప్రజలు, భక్తుల నుంచి పెద్దగా ఆదరణ లభించలేదు. అప్పుడు శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు (Donations) ఇచ్చే వారికి, స్వామి వారి దర్శనాన్ని అనుసంధానం చేస్తూ కొత్త విధానాన్ని అమలు చేసింది టీటీడీ. పది వేల రూపాయలు శ్రీవాణి పథకానికి విరాళంగా సమర్పించిన భక్తులకు….ఎలాంటి సిఫార్సు లేఖతో పని లేకుండా వీఐపీ దర్శనాన్ని కల్పిస్తోంది టీటీడీ. దీంతో ఈ పథకానికి భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది.
2018లో ప్రారంభించిన శ్రీ వాణి ట్రస్టు సేవలు 2019 అక్టోబర్ నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి అక్రమంగా దాతల సంఖ్య.. విరాళాలను పెరుగుతూ వచ్చాయి. శ్రీవాణి ట్రస్టుకు విరాళాలుగా వచ్చే నిధులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నప్పటికీ…విరాళాలు భక్తుల నుంచి వస్తూనే ఉన్నాయి.
2019లో 19 వేల మంది భక్తులు రూ. 26.25 కోట్ల రూపాయలను విరాళంగా అందించగా, 2020లో దాదాపు 50 వేల మంది భక్తులు రూ. 70.21 కోట్లు విరాళంగా సమర్పించారు. 2021లో విరాళాలు ఇచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఆ ఏడాది లక్ష 31 వేల మంది భక్తులు రూ. 176 కోట్లు విరాళంగా అందించారు. ఆ తర్వాత ఏడాది అంటే 2022 ఏడాదికి వచ్చేసరికి 2.70 కోట్ల మంద భక్తులు రూ. 282.64 కోట్లు విరాళంగా అందించగా, 2023లో ఇప్పటి వరకు లక్ష 58 వేల మంది భక్తులు రూ.268.35 కోట్లు విరాళంగా అందించారు.
ఇతర విరాళాలతో కలిసి గత నాలుగేళ్లలో దాదాపుగా రూ. 1000 కోట్లు విరాళంగా వచ్చాయి. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 176 పురాతన ఆలయాల పునఃరుద్ధరణ చర్యలను ప్రారంభించింది టీటీడీ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీలో 2273 నూతన ఆలయాల నిర్మాణాలు ప్రారంభిస్తోంది. ఇక, 501 ఆలయాలకు ధూపదీప నైవేథ్యం కింద ప్రతి నెల 5 వేల చొప్పున చెల్లిస్తూ వస్తుంది టీటీడీ.