ఇండియా`(INDIA) పేరును `భారత్`(BHARAT)గా స్థిరీకరించేందుకు నరేంద్ర మోడీ సర్కారు చర్యలు చేపట్టనున్నట్టు ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జీ-20 సదస్సు కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన ఆహ్వాన పత్రికల్లో ‘President of India’కు బదులుగా ‘President of Bharat’ అని ముద్రించడంతో ఈ చర్చ మొదలైంది.
అంతేగాక, 20 మంది విదేశీ అతిథులకు పంపిణీ చేయనున్న పుస్తకాల్లోనూ `ఇండియా`కు బదులు `భారత్` అని పేర్కొన్నారు. ఇక ప్రధాని మోడీని కూడా ‘ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ అని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఇకపై దేశం పేరు ఆంగ్లంలోనూ ‘ఇండియా’ స్థానంలో ‘భారత్ ‘గా స్థిరీకరించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేయనుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ఈ అంశంపై ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. దేశం పేరు మార్పుపై ఆయా దేశాల నుంచి అభ్యర్థనలు వస్తే.. ఐరాస వాటిని స్వీకరించి పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపింది. ‘ఇండియా’ దేశం పేరు ఆంగ్లంలోనూ ‘భారత్’గా మారనుందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ ఫర్హాన్ హక్ స్పందించారు.
గతేడాది టర్కీ తన పేరును ‘తుర్కియే’గా మార్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు. తుర్కియే విషయంలో ఆ దేశ ప్రభుత్వం పంపిన అధికారిక అభ్యర్థనను తాము స్వీకరించి సానుకూలంగా స్పందించామని చెప్పారు. అలాగే.. ఏ దేశమైనా ఇలాంటి అభ్యర్థనలు పంపిస్తే వాటిని పరిగణనలోకి తీసుకుంటామని హక్ వివరించారు.