కర్ణాటకలోని హోయసల (Hoysala) ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడాల (World Heritage Sites) జాబితాలోకి చేరింది. ఈ విషయాన్ని సోమవారం యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ – యునెస్కో (UNESCO) వెల్లడించింది.
దీనికి ముందు ఆదివారం నాడు పశ్చిమ బెంగాల్లో ఉన్న శాంతినికేతన్ కూడా ఈ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ రెండు భారతీయ కట్టడాలకు యునెస్కో గుర్తింపు లభించింది.
యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో కర్ణాటకలోని హోయసలకు చోటు లభించడం అనేది భారతదేశానికి ఎంతో గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఆ ఆలయాలపై చెక్కిన సమాచారం, అద్భుతమైన శిల్పకళ భారత సాంస్కృతిక వారసత్వం, పూర్వీకుల కళానైపుణ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. హోయసలలోని ఆలయాలు 2014 ఏప్రిల్ 15 వ తేదీ నుంచే యునెస్కో పరిశీలన జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ హోయసల ఆలయాల పరిరక్షణ బాధ్యతలను ఆర్కియాలాజిక్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నిర్వర్తిస్తోంది.
పశ్చిమ బెంగాల్‌లోని చారిత్రక ప్రదేశం, ప్రఖ్యాత బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ వందేళ్లకు ముందు నిర్మించిన విశ్వ భారతి యూనివర్సిటీ ఉన్న శాంతినికేతన్నూ యునెస్కో గుర్తించింది. ఈ శాంతినికేతన్‌ను ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చుతున్నట్లు ప్రకటించింది. శాంతినికేతన్‌కు యునెస్కో గుర్తింపు దక్కడంపై ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతోషం వ్యక్తం చేశారు.
రాజధాని కోల్‌కతాకు సుమారు 160 కిలోమీటర్ల దూరంలోని బోల్పుర్ పట్టణం సమీపంలో ఉన్న శాంతినికేతన్.. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ 1863లో నిర్మించిన ఆశ్రమం. కులమతాలకు అతీతంగా ఎవరైనా ఇక్కడకు వచ్చి పరమాత్మ ధ్యానంలో గడిపేలా దీన్ని నిర్మించారు.
45వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటితో భారత్ నుంచి ఈ జాబితాలో వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశాల సంఖ్య 42కి చేరింది. కాగా, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, చైనా, ఫ్రాన్స్ దేశాల తరువాత అత్యధిక యునెస్కో వారసత్వ ప్రాంతాలు కలిగిన ఆరో పెద్ద దేశంగా ఇండియా నిలిచింది.