జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విపక్ష ఇండియా కూటమి (INDIA Bloc) బలంగా లేదని తెలిపారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు దురదృష్టకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న నాలుగైదు రాష్ట్రాల్లో పరిస్థితి బాగా లేదని చెప్పారు.
మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ విషయంలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయన్నారు. దీంతో చివరకు యూపీలో విడివిడిగా పోటీ చేస్తామని ఆ రెండు పార్టీలు ప్రకటించే స్థితికి వచ్చాయన్నారు. ఇలాంటి పరిణామాలు ‘ఇండియా’కూటమికి ఏమాత్రం మంచిది కాదని వెల్లడించారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ఇండియా కూటమిలో అంతర్గత కలహాల గురించి ఆ సమావేశంలో చర్చిస్తామని పేర్కొన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి.
సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును అఖిలేశ్ యాదవ్ తప్పుబడుతున్నారు. తమకు సీట్లు ఇచ్చే ఉద్దేశం లేకుంటే ముందే చెప్పి వుండాల్సిందన్నారు. బీజేపీని ఓడించేందుకు పొత్తులు అవసరమని తాము భావించామని, కానీ దానికి కాంగ్రెస్ రెడీగా లేదని ఆయన అఖిలేశ్ ఆరోపించారు.