Telugu News » ఝూన్సీ రాజ్య సివంగి… ఝల్కరీ బాయి….!

ఝూన్సీ రాజ్య సివంగి… ఝల్కరీ బాయి….!

టీష్ జనరల్ హ్యూరోజ్ సేనలను చీల్చి చెండాడిన ధీర మహిళ.

by Ramu

షహీద్ ఝల్కరీ బాయి.. చేతి కర్రతో చిరుత పులిని చంపిన సివంగి. ఝాన్సీ లక్ష్మీ బాయికి చెందిన ‘దుర్గా వాహిని’ సైన్యాన్ని ముందుండి నడిపించి పోరాట యోధురాలు. బ్రిటీష్ జనరల్ హ్యూరోజ్ సేనలను చీల్చి చెండాడిన ధీర మహిళ. ఝాన్సీ లక్ష్మీ బాయి ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డు వేసి పోరాటం చేసిన గొప్ప వీర నారీమణి.

ఝూన్సీ రాజ్యానికి సమీపంలోని భోజిలా గ్రామంలో ఓ పేద కుటుంబంలో ఝల్కరీ బాయి జన్మించారు. తండ్రి ప్రోత్సాహంతో చిన్నతనం నుంచే గుర్రపు స్వారీ, కత్తి సాముల్లో ప్రావీణ్యం సంపాదించారు. పశువులను మేపేందుకు వెళ్లగా అక్కడ చిరుత పులి దాడి చేయడంతో చేతి కర్రతో దాన్ని హతమార్చారు. దీంతో ఆమె వీరత్వం గురించి పక్క రాజ్యాలకు పాకింది.

షహీద్ పురాన్ కోరితో వివాహం అనంతరం ఈమె జీవితమే మారిపోయింది. భర్త శిక్షణలో విలు విద్య, కుస్తీల్లో ఆరితేరారు ఝల్కరీ బాయి. భర్త వెంట ఝాన్సీ రాజ్యానికి వెళ్లి అక్కడ లక్ష్మీ బాయికి చెలికత్తెగా చేరారు. క్రమక్రమంగా ఆమె వీరత్వాన్ని తెలుసుకున్న లక్ష్మీ బాయి తన వ్యక్తిగత సైన్యం దుర్గా వాహినిలో ఆమెకు చోటు కల్పించారు. అతి తక్కువ కాలంలోనే ఆ సైన్యానికి నాయకత్వం వహించే స్థాయికి ఝల్కరీ బాయి ఎదిగారు.

లక్ష్మీ బాయి భర్త గంగాధర్ రావు మరణించడంతో ఝాన్సీ రాజ్యానికి కష్టాలు మొదలయ్యాయి. 1858లో ఆంగ్లేయ అధికారి జనరల్ హ్యూరోజ్ ఝాన్సీ కోటపై దండెత్తాడు. లక్ష్మీ బాయి, ఆమె కుమారుడి ప్రాణాలను కాపాడేందుకు రాణికి బదులుగా మారువేషంలో ఝల్కరీ బాయి వెళ్లి హ్యూరోజ్ సైన్యంపై ఎదురు దాడి చేశారు. ఈ యుద్ధంలో ఓవైపు భర్త మరణించాడన్న వార్త తెలిసినా గుండె నిబ్బరంతో యుద్ధం చేసి లక్ష్మీ బాయి, ఆమె కుమారున్ని కాపాడారు. ఇదే పోరులో చివరకు ప్రాణాలు విడిచారు ఝల్కరీ బాయి.

 

You may also like

Leave a Comment