తొమ్మిదేండ్ల క్రితం బాలికపై అత్యాచారం చేసిన కేసులో యూపీ బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) రాందులర్ గోండ్(Ramdular Gond)కు కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం 25 ఏండ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ. పది లక్షల జరిమానా విధించింది. ఈ క్రమంలో ప్రజా ప్రాతినిధ్య చట్ట్ం కింద ఆయనపై అనర్హత వేటు పడినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
జరిమానా మొత్తాన్ని బాధిత మహిళకు అందజేయాలని అధికారులను సోన్ భద్రలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అహ్సన్ ఉల్లా ఖాన్ తీర్పు వెల్లడించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం…. ఏదైనా కేసులో ఒక చట్ట సభ్యుడికి రెండు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు జైలు శిక్ష విధించినట్టయితే ఆ సభ్యున్ని చట్ట ప్రకారం అనర్హుడిగా ప్రకటిస్తారు.
తాజాగా బాలికపై అత్యాచారం కేసులో రాందులర్ గోండ్ కు 25 ఏండ్ల జైలు శిక్ష పడింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రాందులర్ పై అనర్హత వేటు వేశారు.
దీంతో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయారు. మరోవైపు యూపీలో అంతకు ముందు వేర్వేరు కేసుల్లో పలువురు ఎమ్మెల్యేలు దోషులుగా తేలడంతో వారిపై ఈ చట్టం ప్రకారం అనర్హత వేటు పడింది.
గతేడాది అక్టోబర్‌లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆజం ఖాన్, బీజేపీకి చెందిన విక్రమ్ సింగ్ సైనీ (ఖటౌలీ ఎమ్మెల్యే)లపై అనర్హత వేటు పడింది. ద్వేష పూరిత ప్రసంగాల కేసులో ఆజంఖాన్ కు మూడేండ్ల జైలు శిక్ష, 2013లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్ల కేసుకు సంబంధించి సైనీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హత వేటు వేశారు.