ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో అమాత్యులకు తెలిసివచ్చింది. పశువులతో మంత్రి కాన్వాయ్(Convoy) ను అడ్డుకున్న వింత సంఘటన ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లోని బరేలి జిల్లాలో జరిగింది. పశువుతో దిగ్బంధనం చేయబడ్డ మంత్రి శాఖ..పశుసంవర్ధక శాఖ(Department of Animal Husbandry)కావడం విశేషం.అయితే ఈ నిరసన ప్రక్రియకు కారణమైన వాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)రాష్ట్ర పశుసంవర్ధక శాఖామంత్రి ధరంపాల్ సింగ్(Dharampal Singh) గురువారం తన నియోజకవర్గమైన అవోన్లాలోని గుర్గావ్ ప్రాంతంలో సుమారు రూ.9 కోట్లతో నిర్మించనున్న పశు వైద్యశాల భూమిపూజ కోసం వెళ్లారు.
కాగా, గ్రామంలోని వీధుల్లో సంచరించే పశువుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. దీంట్లో భాగంగా రోడ్డుపై పశువులను ఉంచి మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.దీంతో తగిన స్థలాన్ని గుర్తించి గోశాల ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అయితే, మంత్రి ధరంపాల్ సింగ్ కాన్వాయ్‌ను గ్రామస్తులు పశువులతో అడ్డుకోవడంపై పశు వైద్యాధికారి సంజయ్ కుమార్ శర్మ(Sanjay Kumar Sharma)పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని 90 మందిపై ఆదివారం కేసు నమోదు చేశారు.మరోవైపు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ మంత్రిపై మండిపడుతున్నారు.