ఇజ్రాయెల్ (Israel)లో నెలకొన్న పరిస్థితులపై అమెరికా (USA)ను రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్ (Putin) టార్గెట్ చేశారు. యూఎస్ మిడిల్ ఈస్ట్ విధానాల (Middle East Policies) వైఫల్యాలకు ఇది ఒక చక్కని ఉదాహరణ అని ఆయన వివరించారు. ఈ విషయంలో చాలా మంది తన అభిప్రాయాలతో ఏకీభవిస్తారని పేర్కొన్నారు.
మిడిల్ ఈస్ట్‌లో శాంతి స్థాపన విషయంలో గుత్తాధిపత్యం కోసం అమెరికా ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. కానీ దురదృష్టవ శాత్తు మిడిల్ ఈస్ట్‌లో ఆ రెండు దేశాలకు అమోదయోగ్యమైన పరిష్కారాన్ని అన్వేషించే విషయంలో అమెరికా శ్రద్ధ చూపలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్, పాలస్తీనాలపై అమెరికా రెండు వైపుల నుంచి ఒత్తిడి తీసుకు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఐరాస భద్రతా మండలి తీర్మానాలలో వివరించిన విధంగా స్వతంత్ర పాలస్తీనా దేశ-రాజ్య ఏర్పాటుతో సహా పాలస్తీనా ప్రజల ప్రధాన ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏక పక్ష పరిష్కారాలను కనుగొనేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పాలస్తీనా ప్రజల ప్రయోజనాలను అమెరికా ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోలేదని ఆయన విమర్శలు గుప్పించారు.
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో ఇరువైపులా ఉన్న పౌరులకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రష్యా రాజధాని మాస్కోలో ఇరాక్ ప్రధాని మహమ్మద్ అల్ సుదానీతో పుతిన్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.