2023లో ఇప్పటివరకు అన్ని కేటగిరీలు కలిపి మొత్తం 10 లక్షల భారతీయుల వీసా (Visa) దరఖాస్తుల ప్రాసెస్ చేసినట్లు భారత్ (Bharat) లోని అమెరికా ఎంబసీ (America Embassy) ప్రకటించింది. ఈ సంవత్సరం టార్గెట్ ను చేరుకున్నామని తెలిపింది. గతంలో ఓ ఏడాది కాలంలో అమెరికా ఎంబసీ ఎప్పుడూ ఇన్ని వీసాలు జారీ చేయలేదు.
“1 మిలియన్ పూర్తయ్యాయి. 2023 లో వీసా అప్లికేషన్ల ప్రాసెసింగ్ కు సంబంధించిన టార్గెట్ ను పూర్తి చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను’’ అని అమెరికా ఎంబసీ ట్వీట్ చేసింది. ఇంతటితో ఆగిపోమని, ఇంకా ఎక్కువ మంది భారతీయులు అమెరికా రావడానికి సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత్ లోని అమెరికా ఎంబసీ ప్రకటించింది.
భారత్, అమెరికాల మధ్య పరస్పర సంబంధాలు మెరుగుపడాలన్నదే ఇరుదేశాల అభిమతమని భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ తెలిపారు. ఈ దిశగా భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కృషి చేస్తున్నారన్నారు. ఈ సంవత్సరం 10 లక్షల వీసాల ప్రాసెసింగ్ ను సాధ్యం చేసిన కాన్సులేట్ ఉద్యోగులను ఆయన అభినందించారు. మరో 3 నెలల సమయం ఉండగానే, 10 లక్షల వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేశామని చెప్పారు.
ఈ వేసవిలో, జూన్ నుంచి ఆగస్ట్ మధ్య సుమారు 90 వేల స్టుడెంట్ వీసాలను జారీ చేశామని యూఎస్ ఎంబసీ ప్రకటించింది. అమెరికా జారీ చేసిన మొత్తం వీసాల్లో 25% భారతీయ స్టుడెంట్స్ పొందారని తెలిపింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అమెరికా జారీ చేసిన వీసాల్లో 10 శాతం భారతీయులకే కేటాయించారు.
ద్వైపాక్షిక సంబంధాల పరంగా తమకు భారత్ ముఖ్యమైన దేశమని అమెరికా ఎంబసీ అధికారులు తెలిపారు. భారత్ తమకు అత్యంత కీలకమైన బంధం ఉందని పేర్కొన్నారు. ఈ బంధం నిజమైనది అని చాటేలా మున్ముందు రికార్డు స్థాయిలో భారతీయులకు వీసాలు ఇస్తాం అని ఎరిక్ గార్సెటీ వెల్లడించారు.