ఇజ్రాయెల్ (Israel)- హమాస్ (Hamas) యుద్దం ఆరవ రోజుకు చేరుకుంది. గాజా (Gaza)పై ఇజ్రాయెల్ సేనలు ఎయిర్ స్ట్రైక్స్ (Air Strikes) కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతి దాడుల్లో 1354 మంది పాలస్తీనీయులు మరణించినట్టు అధికారులు వెల్లడించారు. మరో 6049 మందికి తీవ్ర గాయాలైనట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరోవైపు గాజా సరిహద్దులను ఇజ్రాయెల్ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. గాజాలోకి ఆహారం, నీరు, విద్యుత్ సరఫరా కాకుండా దిగ్బందించింది. దీంతో గాజా నగరం అంధకారంలోకి వెళ్లింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఉన్న ఔషదాలు మరి కొద్ది రోజుల్లో పూర్తిగా అయిపోయే పరిస్థితి ఉందని ఆరోగ్య శాఖ వర్గాలు ఆందోళన చేస్తున్నాయి. అత్యవసర సర్వీసుల కోసం జనరేటర్లలో ఉపయోగించే ఇంధనం కూడా అయిపోయే అవకాశాలు వుండటంతో అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు ఇజ్రాయెల్ చర్యలను అరబ్ విదేశాంగ మంత్రులు ఖండించారు. గాజా పౌరులకు మానవత్వ సహాయం చేసేందుకు అనుమతించాలని కోరుతున్నారు. గాజాలో పౌరుల కోసం ఆహారం, నీటి సరఫరా, అత్యవసర ఔషదాల వంటి మానవత్వ సహాయాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. మరోవైపు తాము పంపిన మానవత్వాన్ని సహాయాన్ని ఇజ్రాయెల్ సేనలు అడ్డుకుంటున్నాయని టర్కి అధ్యక్షుడు ఎర్డోగన్ సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు తెలిపారు.
గాజాలో పలువురు అమెరికన్లను హమాస్ మిలిటెంట్లు బంధిచారు. ఎంత మందిని హమాస్ మిలిటెంట్లు బంధించారనే దానిపై అమెరికా స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు 17 మంది అమెరికన్లు జాడ తెలియడం లేదని అమెరికా అధ్యక్ష భవనం వెల్లడించింది. అమెరికా పత్రికా కథనాలు, మిస్సింగ్ అయిన వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుల ఆధారంగా ఈ లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ లో హమాస్ కమాండర్ మహ్మద్ అబూ షమ్లా హతమైనట్టు ఇజ్రాయెల్ వర్గాలు వెల్లడించాయి. గాజాలో హమాస్ మిలిటెంట్ల చేతిలో బంధీలుగా వున్న వాళ్లను విడిపించేందుకు హమాస్, ఇజ్రాయెల్ తో చర్చలు జరుపుతున్నట్టు రెడ్ క్రాస్ వివరించింది. గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ పై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇజ్రాయెల్ వెల్లడించింది.
ఇజ్రాయెల్ కు తమ మద్దతు కొనసాగుతుందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హరీస్ అన్నారు. మరోవైపు యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ ఆంటోని బ్లింకన్ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లో దిగారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజ్ మాన్ నెత న్యాహుతో ఆయన భేటీ కానున్నారు. ఇజ్రాయెల్ కు సైన్య పరమైన సహకారం అందించేందుకు తాజాగా జర్మనీ ముందుకు వచ్చింది.