ఇజ్రాయెల్ (Israel)-హమాస్ యుద్ధం నేపథ్యంలో హమాస్ అధికారి అలీ బరాకా (Ali Baraka) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక రోజు యునైటెడ్ స్టేట్స్ కూడా గతానికి సంబంధించిన విషయంగా మిగిలిపోతుందన్నారు. యునైటెట్ స్టేట్స్ కూడా యూఎస్ఎస్ఆర్ లాగా కూలి పోతుందని ఆయన హెచ్చరించారు.
లెబానన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ….. యునైటెడ్ స్టేట్స్‌ను బ్రిటన్, గ్లోబల్ ఫ్రీమాసన్రీ స్థాపించారని పేర్కొన్నారు. త్వరలో యునైటెడ్ స్టేట్స్ కూడా సోవియట్ యూనియన్ లాగా కూలిపోతుందన్నారు. ఈ ప్రాంతంలోని అమెరికా శత్రువులందరూ సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు.
త్వరలోనే అమెరికా వ్యతిరేక శక్తులంతా ఏకమవుతాయన్నారు. వారంతా కలిసి అమెరికాపై యుద్ధం ప్రకటించే రోజు త్వరలోనే రావచ్చన్నారు. దీంతో అమెరికాకు కూడా సోవియట్ యూనియన్ గతే పట్టవచ్చన్నారు. భవిష్యత్‌లో అమెరికా బలీయమైన శక్తిగా ఉండకపోవచ్చన్నారు. అమెరికాపై దాడి చేయగల సత్తా ఉత్తర కొరియాకు ఉందంటూ ఆ దేశంపై అలీ బరాకా ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రపపంచంలో యునైటెడ్ స్టేట్స్ ను ఢీ కొట్టగల ఒకే ఒక్కడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అని ఆకాశానికి ఎత్తారు. త్వరలోనే ప్రపంచ విషయాల్లో ఉత్తర కొరియా జోక్యం చేసుకునే రోజు వస్తుందన్నారు. ఉత్తరకొరియా తమ కూటమిలో ఓ భాగం అన్నారు. త్వరలోనే రష్యా, బీజింగ్ లకు వెళ్లి చర్చలు జరుపుతామన్నారు.