రాహుల్ గాంధీ (Rahul Gandhi) ని విమర్శించే స్థాయి కేటీఆర్ (KTR), కవిత (Kavitha) కు లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy). హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతగాని లక్ష్మమ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీను కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. గాంధీ కుటుంబానికి తెలంగాణకు అత్యంత సన్నిహిత సంబంధం ఉందన్నారు. రాహుల్, ప్రియాంకా గాంధీ నాయకత్వంలో తెలంగాణలో అధికారం చేపట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబం గాంధీలది అయితే.. తెలంగాణ సంపదను దోపిడీ చేసిన కుటుంబం కల్వకుంట్లదని విమర్శించారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో హామీలు ఇచ్చి నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని వివరించారు. బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వాళ్లు ఎంత దుష్ప్రచారం చేసినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమని చెప్పారు ఉత్తమ్. గులాబీ నేతలను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా తాను గెలవబోతున్ననని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే చాలామంది ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు.
కొందరు గులాబీ నేతలు పార్టీ మారే పరిస్థితి లేదని, కానీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని చెబుతున్నారని తెలిపారు ఉత్తమ్. తెలంగాణ సంపదను బీఆర్ఎస్ నేతలు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి.. పవర్ లోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.