ఉత్తరాఖండ్ (Uttarakhand) టన్నెల్ (Tunnel)లో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిన్న ఎండో స్కోపి కెమెరా ద్వారా కార్మికుల వీడియోలను అధికారులు రికార్డు చేశారు. దీంతో వారంతా క్షేమంగా ఉన్నట్టు అధికారులు స్పష్టం చేశారు. తాజాగా టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులతో వారి కుటుంబ సభ్యులను వీడియో ద్వారా మాట్లాడించారు.
మరోవైపు సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ప్రధాని మోడీ ఫోన్ కాల్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ గురించి సీఎంను ప్రధాని మోడీ ఆరా తీశారు. కార్మికులకు ఆహారం, ఔషధాలు, ఇతర అవసరమైన వస్తువులను అందిస్తున్నామని ప్రధానికి వివరించామన్నారు. సొరంగం ఉన్న కొండ పై భాగం నుంచి నిలువుగా డ్రిల్లింగ్ చేసి మరో పైపును పంపించి కూలీలను బయటకు తీసుకు రావాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తాజాగా ఆ ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడింది. సొరంగ పై డ్రిల్ చేస్తుండగా పెద్ద గట్టి బండ రాయి అడ్డు తగిలింది. ఈ క్రమంలో సొరంగం పై నుంచి కాంకుడా సొరంగంలో కూలిన శిథిలాలకు ఒక చివరి నుంచి మరో చివరికి డ్రిల్లింగ్ చేయాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు సొరంగం వద్దకు డాక్టర్లు చేరుకున్నారు. కార్మికులకు పలు జాగ్రత్తలు చెబుతున్నారు.
ఇది ఇలా వుంటే సిల్క్యారా టన్నెల్ కూలిన ఘటన నేపథ్యంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 29 టన్నెల్స్‌లో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది. వీలైనంత త్వరగా సెక్యూరిటీ ఆడిట్ ను పూర్తి చేయాలని అధికారులను ఎన్‌హెచ్ఏఐ చైర్మన్ సంతోష్ యాదవ్ ఆదేశించారు.