ఉత్తరాఖండ్ (Utharakhand)లో మూడు రోజుల క్రితం సొరంగం (Tunnel) కూలి పోయింది. దీంతో సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు గత మూడు రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ టన్నెల్‌లో చిక్కుకున్న వారికి ఓ పైపు ద్వారా ఆక్సిజన్, నీటిని, ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టన్నెల్ పై కప్పు మరోసారి కూలింది.
టన్నెల్‌లో మరోసారి పెద్ద పెద్ద రాళ్లు పడటంతో వాటిని తొలగించడం రెస్క్యూ సిబ్బందికి సమస్యగా మారింది. టన్నెల్ లో చిక్కుకున్న వారిని తొలగించేందుకు గత మూడు రోజులుగా అధికారులు శ్రమిస్తున్నారు. భారీ డ్రిల్లింగ్ మిషన్‌ను తీసుకు వచ్చి శిథిలాలను తొలగిస్తున్నారు. టన్నెల్‌కు అడ్డంగా ఉన్న 21 మీటర్ల స్లాబ్‌ను తొలగించామని అధికారులు వెల్లడించారు.
ఇంకా మరో 19 మీటర్ల మార్గాన్ని తొలగించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. తాజాగా రెస్క్యూ ఆపరేషన్ ను మరింత వేగవంతం చేసేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక యంత్రాలను తీసుకు వచ్చినట్టు చెప్పారు. బుధవారం నాటికి కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకు వస్తామని అధికారులు చెప్పారు. కానీ తాజాగా పై కప్పు కూలడంతో ఆ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోందని అధికారులు తాజాగా వివరించారు.
ఈ క్రమంలో ఇతర కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ తోటి కార్మికులను త్వరగా రక్షిచాలని టన్నెల్ వద్ద ఆందోళనకు దిగారు. ఎలాగైనా అధికారులు కార్మికులను త్వరగా బయటకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు. దీంతో పరస్థిని వివరించి కార్మికులను అధికారులు ఆందోళన విరమించేలా చేశారు.