ఉత్తరాఖండ్‌లో సొరంగం (Tunnel)లో చిక్కుకున్న కార్మికుల(Workers)ను రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సొరంగంలోకి నీటిని సరఫరా చేసందుకు వేసిన పైపుల ద్వారా కార్మికుల ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. అదే పైపుల ద్వారా వారికి తాగునీరు, ఆహారపదార్థాలను అధికారులు సరఫరా చేస్తున్నారు.
ప్రస్తుతం సొరంగంలో చిక్కుకున్న కార్మికులంతా సురక్షితంగానే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తరకాశిలో బ్రహ్మఖల్- యమునోత్రి జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టారు. అందులో భాగంగా సిల్కియారా నుంచి దండల్ గావ్ వరకు ఒక సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు.
శనివారం సొరంగం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో 40 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. సొరంగమార్గం ప్రవేశ ద్వారం వద్ద భారీగా శిథిలాలు పడతంతో వారికి బయటికి వచ్చే మార్గం లేకుండా అయింది. సమాచారం అందుకున్న జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
వెంటనే సహాయక చర్యలు మొదలు పెట్టారు. శిథిలాలను తొలగించేందుకు 48 గంటలుగా డిజాస్టర్ టీమ్స్ శ్రమిస్తున్నాయి. మొత్తం శిథిలాలను తొలగించేందుకు మరో రెండు నుంచి మూడు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరూ గాయపడలేదన్నారు.