ఉత్తర కాశీ (Uttar Kashi)లోని టన్నెల్ (Tunnel) నుంచి బయట పడిన కార్మికులు భావోద్వేగానికి గురయ్యారు. 17 రోజుల పాటు సొరంగంలో తాము పడిని ఇబ్బందులను గుర్తుకు చేసుకున్నారు. రాళ్ల నుంచి కారిన నీటిని తాగానని టన్నెల్లో చిక్కుకున్న కార్మికుడు తెలిపారు. అందుబాటులో ఉన్న మరమరాలు తిని ఇన్ని రోజులు బతికానన్నారు.
మొదటి రెండు రోజులు చాలా ఇబ్బంది పడ్డామని ఝార్ఖండ్‌కు చెందిన అనిల్ బేడియా అన్నారు. అసలు తాము బతికి బయటకు వస్తామన్న ఆశలు కూడా లేవని అనిల్ వివరించారు. ఈ ఘటనను తాము ఓ పీడ కలలాగా భావిస్తున్నామని అన్నారు. పది రోజుల తర్వాత అధికారులు అందించిన పండ్లు, నీళ్లు సహా ఇతర ఆహార పదార్థాలను తిన్నామన్నారు.
దాదాపు 70 గంటల తర్వాత అధికారులు తమను సంప్రదించారన్నారు. దీంతో మళ్లీ తమలో ఆశలు మొదలయ్యాయన్నారు. టన్నెల్లో చిక్కుకున్న వాళ్లలో 15 మంది ఝార్ఖండ్‌కు చెందిన వారే ఉన్నారు. కార్మికులంతా క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగి పోయారు.
ఇక కార్మికులు విజయవంతంగా బయటకు తీసుకు రావడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సంబురాలు చేసుకున్నారు. సొరంగం సమీపంలో బాణ సంచా పేల్చారు. సొరంగం బయట ‘భారత్ మాతా కీ జై’నినాదాలు మారు మోగాయి. ప్రధాని మోడీ జిందాబాద్, సీఎం ధామీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.