ఐరాస (UNO) వేదికగా పాక్ (PAK) కు భారత్ (INDIA) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దక్షిణాసియాలో శాంతి నెలకొనాలంటే ముందుగా పాక్ పై చర్యలు తీసుకోవాలని భారత్ పేర్కొంది. ముందుగా కశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపివేయాలని పాక్ కు సూచించింది. పాక్‌లో ఉన్న ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి, పీఓకేను ఖాళీ చేయాలని సూచించింది. అంతకు ముందు పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కక్కర్ కశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా భారత్ ఈ వ్యాఖ్యలు చేసింది.
అంతర్జాతీయ వేదికలను ఉపయోగించుకుని భారత్ పై దురుద్దేశ పూర్వకంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం పాక్ కు అలవాటుగా మారిందని యూఎన్ జీఏ సెకండ్ కమిటీలో మొదటి సెక్రటరీ పెటల్ గెహ్లాట్ అన్నారు. పాక్‌లో మానవహక్కుల పరిస్థితుల గురించి అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చేందుకు పాక్ ఈ రకమైన ఆరోపణలు చేస్తోందని ఆమె ఫైర్ అయ్యారు.
జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాలు భారత్ లోని భూభాగాలేనని ఆమె మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ము కశ్మీర్, లడఖ్ లకు సంబంధించిన వ్యవహారాలన్నీ భారత ప్రభుత్వ అంతర్గత విషయాలని ఆమె చెప్పారు. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునేందుకు పాక్ ఎలాంటి హక్కు లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
దక్షిణాసియాలో శాంతి కోసం పాక్ పై చర్యలు తీసుకోవాలన్నారు. భారత్ లో పాక్ ఆక్రమిత కశ్మీర్ ను విడిచి వెళ్లాపోవాలని పాక్ కు సూచించారు. అన్నింటికీ మించి పాక్ తన ఇంటిని మొదట చక్క దిద్దుకోవాలన్నారు. పాక్ లో మైనార్టీలపై జరుగుతున్న దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలకు పుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. 2008లో ముంబై ఉగ్ర దాడులకు పాల్పడిన వారిపై పాకిస్థాన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.