‘వ్యాక్సిన్ వార్’ (Vaccine War) సినిమా భారత్ (India) కు వ్యతిరేకంగా జరిగిన కుట్రల (Conspiracies )ను బహిర్గతం చేస్తుందని యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ (CM Yogi Aditya Nath) అన్నారు. ప్రపంచ వేదికపై భారత్ (India) సాధించిన వైజ్ఞానిక విజయాల ను ఈ సినిమా మనకు చూపిస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత గుర్తింపు మరింత పెంచేందుకు ఈ సినిమా దోహదపడుతుందన్నారు.
రూ. 804 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం యోగీ ఆదిత్య నాథ్ శంకు స్థాపన చేశారు. ఈ సందర్బంగా సీఎం యోగీ మాట్లాడుతూ….ది వ్యాక్సిన్ వార్ అనే ఒక కొత్త చిత్రం వచ్చిందన్నారు. భారత దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ఈ సినిమా బహిర్గతం చేసిందన్నారు. భారతీయ శాస్త్రవేత్తలు చేసిన సంచలనాత్మక పరిశోధనలను హైలైట్ చేసేందని పేర్కొన్నారు.
కొంత మంది వ్యక్తులు తమ వ్యక్తిగత ఎజెండాలను అమలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వారి ఉద్దేశాలను అర్థం చేసుకోవడం, వారి చర్యలను ప్రపంచం ముందు బహిర్గతం చేయడం చాలా కీలకమన్నారు. ఈ విషయంలో వ్యాక్సిన్ వార్ గొప్ప చొరవ చూపిందన్నారు. అందువల్ల ఈ సినిమాను ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు.
కరోనా పాండెమిక్ సమయంలో జరిగిన పోరు వ్యక్తిగత యుద్ధం కాదన్నారు. ఈ పోరాటంలో ప్రధాని మోడీ ఓ కెప్టెన్ లాగా ముందుండి భారత్ ను నడిపించారని చెప్పారు. కొంత మంది వ్యక్తులు అసత్య ప్రచారాల ద్వారా ఈ పోరాటాన్ని నీరు గార్చాలని ప్రయత్నించారని వెల్లడించారు. దేశానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలను ఈ సినిమా వెలుగులోకి తీసుకు వచ్చిందన్నారు. దేశాన్ని అణచి వేసేందుకు ప్రయత్నాలు చేసిన వ్యక్తుల నిజ స్వరూపాలను సినిమా బయటకు తీసిందన్నారు.