తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ముగిసింది. డిసెంబరు 23వ తేదీన మొదలయిన ఉత్తర ద్వార దర్శనం.. పది రోజుల పాటు కొనసాగింది. ఈ ప్రత్యేక దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, హుండీ ఆదాయ వివరాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి మంగళవారం మీడియాకు వివరించారు.
వైకుంఠ ద్వార దర్శనం సమయంలో మొత్తం పది రోజుల్లో దాదాపు 6 లక్షల 47 వేల 452 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఈవో తెలిపారు. గత ఏడాది కంటే ఈసారి అదనంగా 40వేల మంది భక్తులు తిరుమలకు వచ్చారని చెప్పారు. ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసి అంతా సక్రమంగా జరిగేలా చూసుకున్నామని వివరించారు.
శ్రీవారి హుండీ ద్వారా రూ.40.10 కోట్లు ఆదాయం లభించిందని చెప్పారు ధర్మారెడ్డి. 17.81 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని.. 35.60 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు తెలిపారు. 2 లక్షల 13 వేల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని వెల్లడించారు.
మరోవైపు, లడ్డూ కాంప్లెక్స్ లో ఉన్న ఐదు కౌంటర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ షిప్ అందించింది. ఈ మేరకు ఈ కౌంటర్లలో ఈవో ధర్మారెడ్డి, బ్యాంకు ఎండీ శ్రీనివాస్ శెట్టి పూజలు చేసి ప్రారంభించారు. ఇకపై ఈ ఐదు కౌంటర్లను బ్యాంకు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పోటు పేష్కార్ శ్రీనివాసులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో ఉన్న లడ్డూ కౌంటర్లను వివిధ బ్యాంకులు నిర్వహిస్తూ ఉంటాయి.