భారత స్వాతంత్ర్య చరిత్ర పుటలను తిరిగేస్తే ఎంతోమంది పోరాట యోధులు ((Warriors) మనకు కనిపిస్తారు. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను తృణ ప్రాయంగా త్యజించి గొప్ప దేశ భక్తిని చాటారు. అలాంటి వీరుల గురించి చదివే కొద్దీ మనలో ఏదో తెలియని గొప్ప స్ఫూర్తి కలుగుతుంది. అణువణునా దేశభక్తి ప్రవహిస్తుంది. ఆ పోరాట యోధుల్లో ఒకరే షహీద్ టీరోట్ సింగ్ సియమ్ (( Tirot Sing Syiem).
1802లో మేఘాలయాలోని కాశీ హిల్స్ లో సిమిలే వంశంలో ఈయన జన్మించారు. అంగ్లో బర్మా యుద్ధం తర్వాత రెండేండ్లకు బ్రిటీష్- బర్మా(మయన్మార్) మధ్య యండబూ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బ్రిటీష్ వాళ్లకి బ్రహ్మపుత్ర లోయలోకి ప్రవేశించే అవకాశం లభించింది. ఈ క్రమంలో తమ వ్యాపారానికి అనువుగా అసోం, సుర్మా లోయ మధ్య కనెక్టివిటీని ఏర్పాటు చేసేందుకు సరైన ప్రాంతం కోసం బ్రిటీష్ అధికారి డేవిడ్ స్కాట్ అన్వేషించాడు.
మేఘాలయ గుండా వెళ్లే మార్గానికి అక్కడి పాలకుడైన టిరోట్ సింగ్ అనుమతి కావాల్సి వచ్చింది. ప్రజలకు మంచి జరిగే అవకాశం ఉందని ఆలోచించారు. వెంటనే, అనుమతులు ఇచ్చారు. దీంతో బ్రిటీష్ అధికారులు పనులు మొదలు పెట్టారు. ఇంతలో ఇతర రాష్ట్రాల్లో ప్రజలపై బ్రిటీష్ వాళ్లు విధిస్తున్న అధిక పన్నులు, చేస్తున్న దురాగతాలు టిరోట్ సింగ్ దృష్టికి వచ్చాయి. డేవిడ్ స్కాట్ ను కలిసి నాంగ్ ఖ్లా ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పారు.
కానీ, దానికి స్కాట్ నిరాకరించాడు. ఈ పరిణామంతో ఆగ్రహించిన టిరోట్ సింగ్ బ్రిటీష్ వాళ్లపై తిరుగుబాటు చేశారు. 8 ఏప్రిల్ 1829న తన సేనలతో కలిసి దాడి చేసి వారిని హతమార్చారు. అప్పుడే బ్రిటీష్-కాశీ యుద్ధం జరిగింది. సుమారు నాలుగేండ్ల పాటు ఇది కొనసాగింది. కాశీ హిల్స్ కొండల్లో బ్రిటీష్ సైన్యంపై టిరోట్ సింగ్ సేనలు గెరిల్లా దాడులు చేశాయి. బ్రిటీష్ వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. చివరకు 9 జనవరి 1833న టిరోట్ సింగ్ ను బ్రిటీష్ అధికారులు అరెస్టు చేశారు. ఆయనకు జీవిత ఖైదు విధించి బంగ్లాదేశ్ లోని ఢాకా సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు శిక్ష అనుభవిస్తూ అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు.