భారతీయ రైల్వే వందే భారత్ స్లీపర్ కోచ్‌లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైయ్యింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw)…వందే భారత్ (Vande Bharat) స్లీపర్ కాన్సెప్ట్ (Sleeper Coach concept) రైలు కోచ్‌ల చిత్రాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ కొత్త రైళ్లు మార్చి 2024 నాటికి అందుబాటులోకి వస్తాయని, ప్రయాణీకులకు వేగవంతమైన, అత్యాధునిక సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తాయని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏసీ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు ప్రధాన నగరాల మధ్య ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ దూరం ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ సెమీ హైస్పీడ్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లను తీసుకురాబోతోంది.
మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా విడుదల చేసిన ఫోటోలలో స్లీపర్ కోచ్‌లు ఎంతో రిచ్‌లుక్‌లో కనిపిస్తున్నాయి. రాత్రి పూట దూర ప్రయాణం చేసేవారికి అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా వీటిని తీర్చిదిద్దారు. ఇందులో ఇంటీరియర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ స్లీపర్ కోచ్‌లు విశాలమైన బెర్త్‌లు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి.
దీంతోపాటు ఇంటీరియర్స్, విశాలమైన టాయిలెట్లు, మినీ ప్యాంట్రీ, ఆధునాతన భద్రతా ఫీచర్లతో కూడిన అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ కోచ్ ల ద్వారా ప్రయాణీకులు రాత్రిపూట హై-స్పీడ్ రైళ్లలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలు కల్పిస్తుందని, రైల్వేల ఆదాయాన్ని మరింత పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎంతో విలాసవంతంగా, లగ్జరీగా ఉన్న ఈ కోచ్‌లు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.