వాసుదేవ్ బలవంత్ ఫడ్కే ((Vasudev Balwant Phadke).. మొట్ట మొదటి విప్లవ కారుడు. సాయుధ తిరుగుబాటు పితామహుడు ((father of armed rebellion). ఎంతో మందికి ఉచిత విద్యను అందించిన గొప్ప సామాజిక వేత్త. బ్రిటీష్ ఖజానాపై దాడి చేసి డబ్బు మొత్తాన్ని కరువు పీడిత ప్రాంతాల ప్రజలకు పంపిణీ చేసిన మానవతా వాది. ఆదివాసీ యువకులతో ఓ దళాన్ని ఏర్పాటు చేసి వలస పాలకులపై దాడులు చేసిన పోరాట యోధుడు.
1845 నవంబర్ 4న మహారాష్ట్రలోని షిర్ధాన్ గ్రామంలో జన్మించారు. తండ్రి బలవంతరావ్ పడ్కే, తల్లి సరస్వతీ. చిన్నతనం నుంచే కుస్తీ, గుర్రపు స్వారీల్లో ప్రావీణ్యం సంపాదించారు. మహదేవ్ గోవింద్ ప్రసంగాలతో స్ఫూర్తి పొందారు. అన్ని వర్గాల ప్రజలను ఏకతాటి పైకి తీసుకు వచ్చి పోరాటం చేస్తేనే భారత్ కు స్వాతంత్య్రం వస్తుందని నమ్మారు. ఐలిఖ్య వర్ధిని సభను ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉచిత విద్యను అందించారు.
ఆ తర్వాత 1875లో మహారాష్ట్ర ఎడ్యుకేషనల్ సొసైటీని ఏర్పాటు చేశారు. అనంతరం భారత్ సాంతంత్య్ర పోరాటం వైపు ప్రజలను మళ్లించేందుకు ప్రయత్నించారు. కరువు ప్రాంతాల ప్రజల పరిస్థితి చూసి చలించి పోయి వారికి ఎలాగైనా సహాయం అందించాలని అనుకున్నారు. బ్రిటీష్ ఖజానాపై దాడులు చేసి ఆ మొత్తాన్ని ప్రజలకు పంచి వారి కష్టాలను తొలగించారు వాసుదేవ్ బలవంత్ ఫడ్కే.
ఆ తర్వాత దాడుల పరంపర కొనసాగించారు. దీంతో ఆయనపై బందిపోటు దొంగగా బ్రిటీష్ ప్రభుత్వం ముద్ర వేసింది. ఆయన తలపై లక్షన్నర రూపాయల బహుమతిని ప్రకటించింది. గిరిజన యువకులతో దళాలలను ఏర్పాటు చేసి బ్రిటీష్ వారిపై దాడులు చేశారు ఫడ్కే. అయితే.. కొందరు స్త్రీలు ఆయన ఆచూకీని బ్రిటీష్ అధికారులకు అందించారు. ఈక్రమంలో ఆయన్ను అరెస్ట్ చేసి ఎడెన్ జైలుకు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన చాకచక్యంగా తప్పించుకున్నారు. కానీ, తర్వాత మళ్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ 1883 ఫిబ్రవరి 17న మరణించారు.