వంచినాథన్ అయ్యర్ (Shaheed Vanchinathan).. ‘భరత మాత సంఘం’ అనే విప్లవ సంస్థలో సభ్యుడు. బ్రిటీష్ అధికారి రాబర్ట్ అష్ ను హతమార్చిన విప్లవ వీరుడు. బ్రిటీష్ పోలీసుల చేతికి చిక్కి శిక్ష అనుభవించడం కన్నా చావడం మేలని తలిచిన గొప్ప పోరాట యోధుడు. తన జీవితాన్ని భరత మాతకు చిన్న బహుమతిగా ఇస్తున్నానని చెప్పి ప్రాణాలు వదిలిన గొప్ప దేశ భక్తుడు.
1886లో తమిళనాడులోని సెంగొత్తాయ్ లో వంచినాథన్ జన్మించారు. తండ్రి రఘుపతి అయ్యర్, తల్లి రుక్మిణీ అమ్మ. సెంగొత్తాయ్ లో విద్యాభ్యాసం పూర్తయిన అనంతరం అటవీ శాఖలో ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కానీ, ఉద్యోగాన్ని వదలి విప్లవ కార్యకలాపాల వైపు మొగ్గు చూపారు.
నీలకంఠ బ్రహ్మచారి స్థాపించిన భరత మాత సంఘంలో సభ్యుడిగా చేరారు. తిరున్యవేలీలో విప్లవకారులను జిల్లా కలెక్టర్ రాబర్డ్ అష్ ఎక్కడికక్కడ అణచి వేశారు. ఈ నేపథ్యంలో అతడ్ని ఎలాగైనా హత మార్చాలని విప్లవకారులు నిర్ణయించారు. హత్య చేసేందుకు నీలకంఠ బ్రహ్మచారి ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ను అమలు చేసే బాధ్యతను వంచినాథన్ కు అప్పగించారు.
17 జూన్ 1911న రాబర్ట్ అష్ తో పాటు మనియాంచి మెయిల్ రైలులో వంచినాథన్ ఎక్కారు. అష్ ప్రయాణిస్తున్న ఫస్ట్ క్లాస్ బోగీలోకి మరో విప్లవకారుడితో కలిసి వంచి ప్రవేశించారు. వెంటనే తనతో తెచ్చుకున్న తుపాకీని తీసి కాల్పులు జరిపారు. దీంతో అష్ అక్కడికక్కడే మరణించాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ప్రాణాలు విడిచారు వంచినాథన్. తన జీవితాన్ని మాతృభూమి కోసం అర్పిస్తున్నానని లేఖలో వెల్లడించారు.