– చెన్నమనేనికి షాకిచ్చిన కేసీఆర్
– మరోసారి వేములవాడ టికెట్ నిరాకరణ
– ఈసారి చెలిమెడ నరసింహారావుకు ఛాన్స్
– ముందే ఊహించిన చెన్నమనేని..
– ట్వీట్ తోనే క్లారిటీ
ఊహించిందే నిజమైంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ (Chennamaneni Ramesh) కి షాకిచ్చారు కేసీఆర్ (KCR). వచ్చే ఎన్నికల్లో ఆయనకు బదులుగా చెలిమెడ లక్ష్మి నరసింహారావు (Narasimharao) కు ఛాన్స్ ఇచ్చారు. ప్రెస్ మీట్ లో చెన్నమనేని ప్రస్తావన తెచ్చిన కేసీఆర్.. ఆయనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో కూడా వివరించారు. వేములవాడ ఎమ్మెల్యే ఎంతో ఉత్తమమైన వ్యక్తి.. అయినా కూడా ఆయన పౌరసత్వంపై వివాదం కొనసాగుతోందని.. దాని కారణంగానే పార్టీకి ఇష్టం లేకపోయినా ఆ స్థానంలో మార్పు చేశామని తెలిపారు.
నిజానికి, ఈ విషయాన్ని చెన్నమనేనికి ముందే చెప్పినట్టు ఉన్నారు. కేసీఆర్ ప్రకటనకు ముందే ఆయన ట్వీట్ చేశారు. ‘‘రాజకీయాలు ప్రజల కోసమే చేయాలి. పదవుల కోసం కాదు. మా తండ్రిగారి మాటలను ప్రతిసారి స్మరించుకుంటూ ఆ పనిని నా తుది శ్వాస ఉన్నంతవరకు చేస్తా. నాతో ఉన్నవారందరికి భరోసా ఇస్తున్నాను. దయ చేసి నిర్ణయాలు మా అందరితో సంప్రదించి మా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తీసుకోవాలి. లేనిపక్షంలో ఆత్మాభిమానాలు దెబ్బతింటాయి. ప్రజల ఆమోదం లభించదు. ఇది మనందరం తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్న మొదటి పాఠం’’ అంటూ పోస్ట్ పెట్టారు.
ఇది చూశాక చెన్నమనేనికి టికెట్ డౌటే అనే చర్చ జోరుగా సాగింది. చివరకు అనుకున్నట్టే జరిగింది. ఇటు వేములవాడ నియోజకవర్గంలో చెలిమెడ నరసింహారావు అభిమానుల్లో సంతోషం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరిని కలుపుకుపోతానని.. మూడవసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు చెలిమెడ.