ఉత్తరాఖండ్ టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం వర్టికల్ డ్రిల్లింగ్ పనులు మొదలు పెట్టారు. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి. శనివారం ఆగర్ మెషిన్ బ్లేడ్ దెబ్బ తినడంతో అధికారులు ప్లాన్ బీ అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే వర్టికల్ డ్రిల్లింగ్ ను మొదలుపెట్టినట్టు వివరించారు.
ఎస్కేప్ పైప్ నుంచి ఆగర్ యంత్రాన్ని బయటకు తీయగానే 10 మీటర్ల వరకు మాన్యువల్ డ్రిల్లింగ్ చేస్తారని అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యేందుకు మరితం సమయం పట్టే అవకాశం ఉన్నట్టు నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అధికారి లెఫ్ట్ నెంట్(రిటైర్డ్) వెల్లడించారు.
సొరంగంలో ఇప్పటికే తవ్విన 47 మీటర్ల కందకంలోకి రెస్క్యూ సిబ్బంది ప్రవేశించి మాన్యువల్ డ్రిల్లింగ్ చేస్తారని తెలిపారు. వర్టికల్ డ్రిల్లింగ్ కోసం ప్రత్యేకమైన మెషిన్లను తీసుకువచ్చారు. వాటిని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మించిన రోడ్డు మార్గం గుండా టన్నెల్ పైకి తీసుకు వెళ్లారు. అంతకు ముందు 47 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేశారు. మరో 15 మీటర్లు మిగిలి వుండగా ఆగర్ మిషన్ బ్లేడ్ దెబ్బతింది.
రెస్క్యూ ఆపరేషన్ ను సీఎం పుష్కర్ సింగ్ ధామీ పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్ ను ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. తాజాగా రెస్క్యూ ఆపరేషన్ పై వివిధ ఏజెన్సీలు, అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.