కెనడా (Canada) లో హత్యకు గురైన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) కు సంబంధించిన వీడియో (Video) ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోలో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) , జనరల్ అరుణ్ కుమార్ వైద్య, పంజాబ్ ముఖ్యమంత్రి బింత్ సింగ్ ల హంతకులను నిజ్జర్ కీరిస్తుండటం కనిపిస్తోంది.
పునీత్ సహానీ అనే ఒక నెటిజన్ ఈ వీడియోను షేర్ చేశారు. ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించిన ఇందిరా గాంధీని అక్టోబర్ 31న హత్య చేసి అనంత లోకాలకు పంపించారని నిజ్జర్ అన్నారు. ఆ తర్వాత గోల్డెన్ టెంపుల్ పై తన బలగాలతో దాడి చేసి, తనను తాను గొప్ప కమాండర్‌గా చెప్పుకున్న జనరల్ సింగ్ వడియాను పుణెలో హత మార్చి తిరిగిరాని లోకాలకు సాగనంపారన్నారు.
అనంతరం 1984 అల్లర్లకు కారణమైన లలిత్ మాకెన్ ను, సిక్కుల తలపాగను తొలగిస్తానంటూ ప్రతిజ్ఞ చేసిన మాజీ సీఎం బీంత్ సింగ్ ను దిలావర్, తారా, హవారాలు బాంబు దాడి చేసి హత్య చేశారన్నారు. ఇది తమ వారసత్వం అని నిజ్జర్ వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 18న ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ పై గుర్తు తెలియన వ్యక్తి కాల్పులు జరిపారు. దీంతో నిజ్జర్ మరణించారు.
ఇమిగ్రేషన్ మోసాలకు పాల్పడ్డారని, వేర్పాటు వాద, ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు పలుకుతున్నారని నిజ్జర్ పై ఆరోపణలు వున్నప్పటికి 2007లో ఆయనకు కెనడా ప్రభుత్వం పౌరసత్వాన్ని మంజూరు చేసింది. ఇది ఇలా వుంటే నిజ్జర్ హత్యకు భారత ఏజెంట్లకు సంబంధం ఉందని కెనడా ప్రధాని ట్రూడో సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు భారత్ ఖండించింది. ఇక అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బ తిన్నాయి.