తమిళనాడు, త్రిపుర వంటి రాష్ట్రాల్లో టీజీ అనే పేరు ఉండడంతోనే తెలంగాణ స్టేట్ (TS)గా గత ప్రభుత్వం మార్చిందని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ (B.Vinod Kumar)తెలిపారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలిగించేందుకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు.
తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరిక చిహ్నాలంటూ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడడం దేనికి సంకేతమని నిలదీశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సారనాథ్ స్థూపంపై ఉన్న మూడు సింహాలు, అశోక చక్రం చిహ్నాలను భారత దేశ చిహ్నంలో తీసుకున్నారని గుర్తు చేశారు. మరి అవి రాచరిక వ్యవస్థకు సంకేతం కాదా? అని ప్రశ్నించారు.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ వ్యవసాయాన్ని, తెలంగాణ భాషను, యాసను, తెలంగాణ చరిత్రను తుడిచివేయాలని ఆంధ్రాపాలకులు అనుకున్నారని చెప్పారు. కానీ ప్రస్తుతం సీఎం తీరు చూస్తుంటే తెలంగాణ చరిత్రను కనుమరుగు చేయాలని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.
కాకతీయులు 11,12వ దశాబ్దాల్లో యావత్ దక్షిణ భారత దేశాన్ని పరిపాలించారని అన్నారు. కాకతీయులు రాచరిక వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్లు కాదని, పేదల కోసం పని చేసిన వారని తెలిపారు. కాకతీయుల కాలంలో తెలంగాణలో గొలుసుకట్టు చెరువులతో పాటు రామప్ప, లక్నవరం, పాకాల, సింగసముద్రం, ఘనపూర్, నల్లగొండ జిల్లాలో పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్‌తో పాటు వేలాది చెరువులు, కుంటలను నిర్మించారని గుర్తు చేశారు.
వాటి వల్లే ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయం కొనసాగుతోందన్నారు. తెలంగాణ వచ్చాక పదేండ్లలో కేసీఆర్ చెరువులు, కుంటలను మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేశారని వెల్లడించారు. కాకతీయులు అణగారిన బీసీ కులానికి చెందిన వారని చరిత్రకారులు చెబుతుంటారని వివరించారు. 800 ఏండ్ల కాకతీయుల చరిత్రకు నిదర్శంగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తామమంటూ సీఎం ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారంటూ నిప్పులు చెరిగారు.
కాకతీయులు పాలించిన ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కొండా సురేఖ, సీతక్క మంత్రులుగా ఉన్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తుల గురించి కేబినెట్‌లో చర్చకు వస్తే మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మలనాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరస్కరించాలని కోరారు.
తెలుగు దేశం నుంచి వచ్చిన లక్షణాలు రేవంత్ రెడ్డిలో ఇంకా పోయినట్లు అనిపించడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం హుందాగా ఉండాలి కానీ.. ఎవరో చెప్పిన వాటిని నమ్మి ఇలా ప్రవర్తించడం ఏమిటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెనకి తగ్గకుంటే ప్రజలను, యువతను ఏకంచేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.