ప్రతి ఒక్కరూ సేవాభావం అలవర్చుకోవాలని హంపి (Hampi) పీఠాధిపతి శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి (Virupaksha Vidyaranya Bharati Swami) అన్నారు. హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా పని చేసే నిర్మాణ సంస్థ లక్ష్మి నివాసంలో జరిగిన కార్యక్రమంలో స్వామీజీ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేవాలయాల (Temples) ప్రాముఖ్యతను వివరించారు. అలాగే, రక్షణ విషయంలో కీలక సూచనలు చేశారు.
హిందూ (Hindu) సమాజాన్ని, ధర్మాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని.. అలాంటి వాటిని తిప్పికొట్టాలని సూచించారు విరూపాక్ష విద్యారణ్య భారతి. ముఖ్యంగా ఆలయాల పరిరక్షణ చాలా ముఖ్యమని సూచించారు. విచ్చలవిడిగా జరుగుతున్న మత మార్పిడులకు అడ్డుకట్ట వేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అమాయక హిందువులను ఏమార్చి మతం మార్చుతున్నారని దీని వెనుక పెద్ద కుట్ర ఉందని తెలిపారు.
సామాన్య భక్తులను ఆలయ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం వల్ల స్వచ్ఛ దేవాలయాల నినాదానికి సార్థకత లభిస్తుందని అన్నారు స్వామీజీ. బస్తీల్లో ఉండే ఆలయాలను శుభ్రంగా ఉంచుకోవడం, పరిరక్షించడం వంటి కార్యక్రమాల్లో భక్తులు పాలుపంచుకోవడం వల్ల హిందూ సమాజం మరింత బలపడుతుందని తెలిపారు. ఆలయాల నిర్వాహకులు వీటిపై దృష్టి పెట్టాలని సూచించారు విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి.
1336లో విజయనగరాన్ని స్థాపించిన రాజ గురువులు శ్రీ విద్యారణ్య స్వామి హంపిలో విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానాన్ని(పీఠాన్ని) స్థాపించారు. అప్పటి నుంచి ఈరోజు వరకు ఈ పీఠం ధర్మప్రచారానికి, ధర్మరక్షణకు ఎనలేని కృషి చేస్తోంది. చరిత్రలో ఎన్నోసార్లు ఆలయాలు ధ్వంసమై పూజలు ఆగిపోతే, ఎంతో ధైర్యంతో ఈ పీఠం వారే అక్కడకు తరలివెళ్ళి తిరిగి పూజాదికాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం విద్యారణ్య స్వామి పరంపరలో 46వ పీఠాధిపతిగా శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి పీఠాధిపత్యం వహిస్తున్నారు.