విశాఖ రూరల్ తహసీల్దార్ (Tahsildar) సనపల రమణయ్య (Ramanaia) హత్య (Murder) నగరంలో సంచలన సృష్టించిన విషయం తెలిసిందే.. అదీగాక రాజకీయంగా తీవ్ర దుమారాన్ని సైతం రేపింది. ప్రశాంతతకు మారు పేరుగా ఉన్న విశాఖ (Vishaka) నగరాన్ని.. హత్యలు, కిడ్నాప్లకు కేంద్రంగా అధికార వైసీపీ (YCP) నేతలు మార్చారంటూ ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి.
మరోవైపు రమణయ్య ఇంట్లో ఇంకో విషాదం చోటుచేసుకొంది. వరుసకు సోదరుడు అయ్యే రాజేంద్ర మృతి చెందారు, గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన తాజాగా మరణించారు. కాగా తహశీల్దార్ హత్య జరిగిన రోజు రాజేంద్ర పొంతన లేని విషయాలు మాట్లాడాడనే ఆరోపణలున్నాయి. చీపురుపల్లిలో భూమి వివాదంలో ప్రసాద్ అనే వ్యక్తి.. తహసీల్దార్ రమణయ్య హత్యకు కారణం అనే అనుమానం సైతం వ్యక్తం చేశాడు..
ఇలా తహసీల్దార్ రమణయ్య హత్య కేసుతో సంబంధం లేని విషయాలను రాజేంద్ర తెరపైకి తేవడంతో పలు అనుమానాలు చోటు చేసుకొన్నాయి. మరోవైపు నిందితుడు గంగారాం అరెస్టుతో ఈ కేసు విచారణలో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఇప్పుడు రాజేంద్ర మృతిపై కూడా విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో సాక్షాత్తూ విశాఖ ఎంపీ కుటుంబ సభ్యులను కిరాయి గూండాలు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని చేస్తామని చెబుతున్న వైసీపీ నాయకులు.. కనీస స్థాయిలో నగర పౌరులకు భద్రత లేకుండా చేస్తున్నారన్న విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పుడే నగరంలో ఇటువంటి దారుణాలు చోటు చేసుకొంటుంటే.. భవిష్యత్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది..