ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు(AP politics) రసవత్తరంగా మారాయి. మరికొద్దిరోజుల్లో ఆ రాష్ట్రంలో లోక్‌సభతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల షెడ్యూల్ ప్రకారం.. నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.
అయితే, జంపింగ్ జపాంగులు మాత్రం గోడ మీద నిలబడి చిత్రం చూస్తున్నారు. అంతర్గత సర్వేలు చేయించుకుంటూ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మైలేజ్ వస్తుందని లెక్కలేసుకుంటున్నారు. దానిని బట్టి ఏ పార్టీ లోకి వెళ్లాలని బేరీజు వేసుకుంటున్నారు. ఇప్పటికే అధికార వైసీపీ(YCP)కి చెందిన కొందరు కీలక నేతలు అటు టీడీపీ(TDP), ఇటు జనసేన(JANASENA) పార్టీలో చేరారు.
అందులో సిట్టింగు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. గతంలో వైసీపీ గుర్తుపై గెలిచిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ టికెట్ కూడా కన్ఫామ్ చేసినట్లు తెలిసింది.
తాజాగా అధికార వైసీపీ నుంచి దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఆయన సోదరుడు శ్రీధర్ వైసీపీని వీడేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. అందుకే వీరిద్దరు సీఎం జగన్ బస్సు యాత్రకు దూరంగా ఉన్నారని టాక్. మరో రెండ్రోజుల్లో వీరిద్దరు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారని వినికిడి. దర్శి ఎమ్మెల్యే టికెట్‌ను సీఎం జగన్ తాజాగా బూచేపల్లి శివప్రసాద్‌కు కేటాయించడంతో మద్దిశెట్టి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అందుకే మద్దిశెట్టి సోదరులు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని కూడా తెలుస్తోంది.