రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు…ఆలుమగలు చెమటోడ్చిసంపాదిస్తేనే గాని బండి నడవని జీవితాలు. బతకడానికి చేసే పనిలో మృత్యువు బలితీసుకోవచ్చు. కాబట్టి పనిచేసే చోట అప్రమత్తంగా ఉండాలి. లేదంటే భుక్తి మాట దేవుడెరుగు మనుషులే మిగలరు.
అలాంటి ఘటనే హైదరాబాద్(Hyderabad) చందానగర్(Chandanagar)లో చోటుచేసుకుంది.పాత గోడను కూల్చే సమయంలో ప్రాణాలనే పోగొట్టుకున్నాడో వ్యక్తి. ఈ దుర్ఘటన హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాపిరెడ్డి కాలనిలో రాజీవ్ గృహ కల్ప సమీపంలో కూకట్పల్లికి చెందిన జయరావు(45) రోజుకూలీ పనిలో భాగంగా నిన్న పాత ఇంటిని గోడను కూల్చే పనికి వెళ్లాడు. తనతో పాటు మరో వ్యక్తి కూడా పాత గోడను కూల్చడానికి ప్రయత్నాలు చేశారు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గోడ మీద పడింది. దీంతో జయరావు(Jayarao)కి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే కొండాపూర్( Kondapur) ఏరియా ఆసుపత్రికి తరలించారు.అప్పటికే జయరావు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీకి తరలించినట్లు తెలిపారు.