షహీద్ రాణా రతన్ సింగ్ (Shaheed Rana Rathan Singh)…. సింధు ప్రాంతంలో బ్రిటీష్ (British) పాలకుల అక్రమాలను ఎదురు నిలిచిన ధీశాలి. అధిక పన్నులపై ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నడిపిన గొప్ప నాయకుడు ఆయన. బ్రిటీష్ వాళ్లు పెట్టే ప్రాణ భిక్ష కన్నా ప్రాణాలు వదలడం మేలని ఉరి కంబమెక్కిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు రాణా రతన్ సింగ్.
1843లో బ్రిటీష్ వాళ్లు సింధు ప్రాంతాన్ని ఆక్రమించారు. ఆ ప్రాంతంపై సయ్యద్ మహ్మద్ అనే వ్యక్తిని కలెక్టర్ గా నియమించారు. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అప్పటికే కరువుతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై ఆంగ్లేయులు అధిక పన్నులు విధించారు. దీంతో ఆ పన్నులు చెల్లించలేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
ఈ క్రమంలో రాణా రతన్ సింగ్ ఆధ్వర్యంలో సింధు ప్రజలు తిరుగుబాటు చేశారు. దీంతో ప్రజలపై హింసాకాండకు దిగిన కలెక్టర్ సయ్యద్ మహ్మద్ ను రాణా రతన్ సింగ్ కాల్చి చంపాడు. అనంతరం రాణా రతన్ సింగ్ ను బ్రిటీష్ అధికారులు అరెస్టు చేశారు. బ్రిటీష్ న్యాయస్థానం ఆయనకు మరణశిక్ష విధించింది.
విషయం తెలుసుకున్న ఆయన స్నేహితులు, స్థానికులు రాణా రతన్ సింగ్ కు క్షమాభిక్ష పెట్టాలని బ్రిటీష్ పాలకులను కోరారు. ప్రజల విజ్ఞప్తిని మన్నించి ఆయనకు క్వీన్ విక్టోరియా క్షమాభిక్ష ప్రసాదించారు. కానీ క్షమాభిక్షను అంగీకరించి ఓ పిరికి వాడిలా ప్రాణాన్ని కాపాడుకోవడం కన్నా మరణించడమే మేలని నిర్ణయించుకున్నాడు. చివరికి ఉరికంబం ఎక్కి ప్రాణాలు విడిచాడు.