వరంగల్ జిల్లా(Warangal District)లో ఓ గ్యాస్ వినియోగదారుడి(Gas consumer)కి వింత అనుభవం ఎదురయింది. వంట చేసేందుకు వినియోగించే గ్యాస్ సిలిండర్(Gas cylinder)లో వంట గ్యాస్ ఇంధనంకు బదులు సిలిండర్‌లో నీరు వచ్చింది. ఇలా నీరు రావడం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదని స్థానికులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వర్ధన్నపేట(Vardannapet) పట్టణానికి చెందిన ఆకుల సత్యం(Akula Satyam) అనే వినియోదారుడు ఎప్పటిలాగే గ్యాస్ బుక్ చేశాడు. సంగెం మండలంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుండి గ్యాస్ సిలిండర్ రాగ వచ్చిన సిలిండర్‌ను గ్యాస్ పొయ్యికి అనుసంధానించాడు. ఎంత ప్రయత్నించినా పొయ్యి వెలగలేదు.
దీంతో అసలు సిలిండర్‌లో గ్యాస్ ఉందా? లేదా? అనే అనుమానంతో గ్యాస్ సిలిండర్‌ను పరిశీలించాడు. ఇంకేముంది ఆ సిలిండర్ లో గ్యాస్ కాకుండా నీరు ఉండడాన్ని గమనించి ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల తీరుపై సదరు వినియోగదారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వినియోగదారులను ఇబ్బంది పెట్టే విధంగా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల వ్యవహారం ఉందని ఆరోపించాడు. వినియోగదారుల ఫోరంను ఆశ్రయిస్తానని బాధితుడు తెలిపాడు. సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.