వేసవి రాకముందే గ్రేటర్ హైదరాబాద్(Greter Hyderbad) పరిధిలో నీటి కష్టాలు(Water Issues) మొదలయ్యాయి. ఓ వైపు ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. దీంతో నగరవాసులు పరేషాన్ అవుతున్నారు.దీనికి తోడు నగరంలో నీటి ఎద్దడి నెలకొంది. వేసవి తాపంతో భూగర్బ జలాలు, రిజర్వాయర్లలో నీరు అడుగంటుతుండటంతో వాటర్ ట్యాంకర్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది.
దీంతో ట్యాంకర్ల బుకింగ్స్ జోరందుకున్నాయి. వేసవిలో నగరవాసుల నీటి అవసరాలు గుర్తించడంలో జలమండలి అధికారులు విఫలం అయ్యారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కొందరు వాటర్ ట్యాంకర్లను అక్రమంగా బుక్ చేసుకుని భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికీ నగరంలోని కొన్ని మురికివాడలు, బస్తీల్లో వాటర్ ట్యాంకర్ల ద్వారానే జలమండలి వాటర్ సప్లయ్ చేస్తోంది. దీనికి తోడు పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్ వంటి కమర్షియల్ అవరసరాలకు కూడా సప్లయ్ చేస్తుంటుంది. ఉదయం గృహ అవసరాలు, రాత్రిళ్లు కమర్షియల్ అవసరాలకు నీటిని సరఫరా చేస్తోంది.
అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రధానంగా 4 డివిజన్లలో వాటర్ ప్రాబ్లమ్ చాలా ఉన్నట్లు జలమండలి గుర్తించింది. (డివిజన్ -15,6,18,9) నుంచి అధిక సంఖ్యలో వాటర్ ట్యాంకర్ల బుకింగ్ 73 శాతం అవుతున్నట్లు జలమండలి అధికారులు గుర్తించారు. ప్రస్తుతం నగరంలో నీటికి డిమాండ్ పెరిగిన దృష్ట్యా 72 ఫిల్లింగ్ స్టేషన్ల ద్వారా 580 ట్యాంకర్లు నిరంతరం నీటిని సరఫరా చేస్తున్నాయని అధికారులు తెలిపారు.గ్రేటర్లో ప్రస్తుతం డొమెస్టిక్ అవసరాలకు 5వేల లీటర్లకు రూ.500 చార్జి వసూలు చేస్తుండగా.. కమర్షియల్ అవసరాలకు 5వేల లీటర్ల నీటికి గాను రూ.850 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.