స్వాతంత్రానికి ముందు చివరిసారి బీసీ (BC) కులగణన జరిగిందని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. బీసీ కులాల సంఖ్యపై స్పష్టత లేకపోవడంతో అయోమయం నెలకొందని తెలిపారు. వెనుకబడిన వర్గాలు కోల్పోతున్న రిజర్వేషన్లపై అందరూ స్పందించాలని కవిత కోరారు.
వికారాబాద్‌లో నిర్వహించిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి కవిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ…..బీసీ హక్కుల కోసం పోరాటానికే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు. కుల వ్యవస్థ నిర్మూలన, మహిళోద్ధరణ కోసం కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకే ‘యునైటెడ్ పూలే ఫ్రంట్’ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తింపు తీసుకు రావాలని జాగృతి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటు చేశామని అన్నారు. తెలంగాణ జాగృతి అనేక కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందని వెల్లడించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలు కుల వివక్ష నుంచి విముక్తి కల్పించాలని, బీసీ రిజర్వేషన్లు కూడా పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. సమాజంలో కుల వివక్ష జరుగుతోందన్నారు. బీసీల్లో నిరుద్యోగులు టాలెంట్ ఉన్నప్పటికీ రిజర్వేషనల్ కారణంగా ఉద్యోగాలను సాధించలేకపోతున్నారని చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ తరహాలో జరిగే పరీక్షల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. అందువల్ల బీసీల హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కులగణన ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రారంభిస్తేనే ఆరు నెలల్లో కులగణన పూర్తి చేయవచ్చునన్నారు.