రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ (Real Estate) అభివృద్ధికి కాంగ్రెస్ (Congress) సర్కార్ ప్రాధాన్యతనిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Batti Vikramarkha) అన్నారు. రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయ మార్గాలు తెచ్చే వెల్త్ క్రియేటర్లను ఏ మాత్రమూ ఇబ్బంది పెట్టబోమని వెల్లడించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ తెలంగాణా విభాగం ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్బంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ను మరింత అభివృద్ధి చేసేందుకు పలు సూచనలు ఆ బృందం సూచించింది. ఈ మేరకు ప్రతిపాదనలను డిప్యూటీ సీఎంకు డిప్యూటీ సీఎంకు అందచేసింది.
ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ…. డబ్బులు కట్టి గత రెండు మూడేండ్లుగా పెండింగ్లో ఉన్న ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందన్నారు. ధరణిపై తగిన సలహాలు, సూచనలను అందజేస్తే తాను పరిశీలించడంతో పాటు ధరణి పై ఏర్పాటు చేసిన కమిటీకి అందిస్తానన్నారు.
థేమ్స్ నది మాదిరిగా మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో పాటు రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణంతో హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మూసీ నది ప్రక్షాళనతో సుందరీకరణ జరిగి పర్యాటకం అభివృద్ధి చెందుతుందన్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ ప్రధాన శక్తిగా మారుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చడానికి శివారు ప్రాంతాల్లో ఇండస్ట్రియల్, ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ తెలంగాణా విభాగం ప్రతినిధి బృందం పలు సూచనలను, సలహాలను అందించింది. భవన నిర్మాణ రంగ అభివృద్ధికి ‘రేరా’ఏర్పాటైందని , భవన నిర్మాణ అనుమతులకు ప్రస్తుతం 10 శాతం మార్టగేజ్ విధానం ఉందని, దాన్ని ఎత్తి వేయాలని కోరారు. రాష్ట్రంలో అధికంగా ఉన్న రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించాలని, జీ.ఓ. 50 ను ఎత్తివేయాలని సూచించారు.
భవన నిర్మాణాలకు తీసుకుంటున్న తాత్కాలిక విధ్యుత్ కనెక్షన్లకు యూనిట్ కు రూ. 9 నుండి 14 రూపాయలకు పెంచారని గుర్తు చేశారు. దీన్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో గత ఆరు నెలలనుండి ఎన్విరాన్ మెంట్ కమిటీ లేదని, వెంటనే ఆ కమిటీని వేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న లక్షలాది ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, తద్వారా పెద్ద ఎత్తున నిర్మాణాలు ప్రారంభమై ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు.