– వాయుగుండంగా మారిన అల్పపీడనం
– ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు
– తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్
– శ్రీలంక తీరంలో మరో ఉపరితల ఆవర్తనం
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. అండమాన్, నికోబార్ దీవులకు అనుకుని ఇది ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. వాయుగుండం కారణంగా ఏపీ లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించింది.
వాయుగుండం ప్రభావంతో బంగాళాఖాతం తీర ప్రాంతాలు భయానకంగా ఉన్నాయి. అలలు సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతుండడంతో సమీప ప్రాంతాల్లో నివాసముంటున్నవారు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. కొత్త కోడూరుతో పాటు పలు తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకొచ్చింది. 50 అడుగుల నుంచి 100 అడుగుల మేర ముందుకు వచ్చేసింది. దీంతో తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో టెన్షన్ నెలకొంది.
మత్స్యకారులు చేపల వేటను నిలిపివేశారు. జగన్ ప్రభుత్వం మరమ్మతులు చేపట్టకపోవడంతో తుపాను షెల్టర్లు అధ్వాన్నంగా మారాయని అంటున్నారు. వాయుగుండం గురువారం తీవ్ర వాయుగుండంగా మారుతుందని అధికారులు తెలిపారు. తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు.
రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతంలోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ సమయంలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందన్నారు. అలాగే కొన్ని చోట్ల పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉందని తెలిపారు. మరోవైపు శ్రీలంక తీరాలకు సమీపంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒడిశా, పశ్చిమ బెంగాళ్ లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.