పార్లమెంట్ (Parliament)లో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ ఇండియా కూటమి (India Alliance) నేతలు ఈ రోజు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సేవ్ డెమోక్రసీ పేరిట నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇద్దరు వ్యక్తులు లోక్ సభలోకి చొచ్చుకు వచ్చారని, స్మోక్ క్యాన్స్ తీసుకు వచ్చారని చెప్పారు.
వాళ్లు సభలోకి ఎలా వచ్చారని రాహుల్ ప్రశ్నించారు. వాళ్లు గ్యాస్ సిలిండర్లు తీసుకు వచ్చారని, ఆ వస్తువులను తీసుకు రాగలిగారంటే వాళ్లు ఇంకేమైనా తీసుకు రాగలరని ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లు ఎందుకు నిరసన తెలిపారనేది రెండవ ప్రశ్న అన్నారు. ఆ యువకులకు నిరసనకు నిరుద్యోగమే కారణమన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందన్నారు. ఈ దేశ యువత ఉపాధి పొందలేకపోతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ…. ప్రధాని మోడీకి చాలా గర్వం ఉందన్నారు. 400 సీట్లు గెలుస్తామని సార్వత్రిక ఎన్నికలకు ముందే మోడీ చెబుతున్నారని పేర్కొన్నారు. మోడీకి అంత ప్రజాదరణ ఉందా? అని ప్రశ్నించారు. 400 సీట్లు గెలిచేందుకు మీకు ఏమి కావాలని ప్రశ్నించారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ల్లో ఏం జరిగింది? అని అడిగారు. ఆయన్ను ఎన్నుకున్న ప్రజలే ఆయనను గద్దె దించుతారని ఫైర్ అయ్యారు.
పార్లమెంట్ పై దాడి జరిగిందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. సస్పెండ్ అయిన 146 మంది ఎంపీలు దానికి మూల్యం చెల్లించుకుంటున్నారని తాను చెప్పాదల్చుకున్నానన్నారు. మన దేశంలో రైతుల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందన్నారు. పేదలు కష్టాలు పడుతున్నారని, నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని,దానికి కారణం బీజేపీ అని నిప్పులు చెరిగారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు తాము ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని సీపీఎం నేత సీతారాం ఏచూరీ ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో ఇన్ని సస్పెన్షన్ల గురించి ఇప్పటి వరకు ఎవరూ వినలేదన్నారు. మరోసారి బీజేపీ గెలిస్తే పార్లమెంటును కూడా తుడిచిపెట్టేయవచ్చని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం ఇప్పుడు చాలా అవసరమన్నారు. అందుకే ఈ రోజు ఇండియా కూటమి సమావేశమైందన్నారు. అమృత్ కాలం వస్తోందని చెప్పారన్నారు. కానీ ఇప్పుడు అమృత కలష్ విషపూరితమైందన్నారు.