చంద్రయాన్ – 3 విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు నిద్రలోంచి మేల్కుంటాయా లేదా అని ఇస్రో శాస్త్రవేత్తలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వీరితో పాటు దేశ ప్రజలంతా.. చాలా ఆసక్తిగా చంద్రయాన్ – 3కి సంబంధించిన విషయాలను తెలుసుకుంటున్నారు. అయితే చంద్రుడిపై మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎలక్ట్రానిక్ పరికరాలు తట్టుకోవడం, రీఛార్జి కావడంపైనే ఆధారపడి ఉంది. అవి మళ్లీ రీఛార్జీ అయితేనే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు నిద్రావస్థ నుంచి మేల్కొని మళ్లీ పని చేస్తాయి.
చంద్రయాన్-3 దిగిన శివ్ శక్తి పాయింట్ వద్ద పగటి సమయం ముగిసి చీకట్లు అలముకోవడంతో ఇస్రో ఈ నెల 2, 4 తేదీల్లో ల్యాండర్, రోవర్‌లను నిద్రాణ స్థితిలోకి మళ్లించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన వాటిని 14 రోజులు పని చేసేలా తయారు చేశారు. ల్యాండింగ్ ప్రాంతంలో సూర్యోదయం ోసం మరో రెండు రోజులు వేచి చూడాల్సి ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే ఈనెల 22వ తేదీన రోవర్, ల్యాండర్లను మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తామని వివరించారు.
నిద్రావస్థలోకి వెళ్లక ముందే చంద్రుడిపై సౌత్ పోల్ పై తిరుగుతూ పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్… చంద్రుడి పొరల్లో ఉన్న కెమికల్ ఎలిమెంట్స్, ఖనిజాలను కనుగొంది. ప్రజ్ఞాన్ రోవర్ లోని లిబ్స్ గా పిలుచుకునే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్ స్ట్రుమెంట్ సహాయంతో చంద్రుడిపై ఉన్న ఎలిమెంట్స్ ను కన్ఫర్మ్ చేసింది ఇస్రో. అన్నింటికంటే ముఖ్యంగా చంద్రుడి ఉపరితలంపై దక్షిణధృవంపై సల్ఫర్ నిల్వలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది.
అంత కంటే అద్భుతమైన విషయం ఏంటంటే చంద్రుడిపై ఆక్సిజన్ నిల్వలను కూడా గుర్తించింది ప్రజ్ఞాన్ రోవర్. అల్యూమినియం, కాల్షియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, సిలికాన్, టైటానియం నిల్వలను ధృవీకరించింది. హైడ్రోజన్ ను వెతికే పనిలో ఉన్నామని ప్రకటించిన ఇస్రో… అందుకు సంబంధించిన రెస్పాన్స్ వేల్ లెంత్ గ్రాఫ్ ను విడుదల చేసింది.
చంద్రుడి సౌత్ పోల్ పై ఉన్న కెమికల్ ఎలిమెంట్స్ ఏంటి అనే విషయాలపై ఇప్పటివరకూ ఫార్ అవే అబ్జర్వేషన్స్ తప్ప ఇన్ సైటూ సైంటిఫిక్ ఎక్స్ పెరిమెంట్స్ ఏ దేశం చేయకపోగా ఆ ఘనత సాధించిన తొలి స్పేస్ ఏజెన్సీగా ఇస్రో..తొలి దేశంగా భారత్ పేరు సంపాదించనట్లైంది. సల్ఫర్ ను సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారీ దగ్గర నుంచి రాకెట్ ప్రొపల్లెంట్స్ తయారీ వరకూ ఉపయోగించుకునేందుకు అవకాశం ఉండగా..ఆక్సిజన్ ప్రాణవాయువుగా మనిషి మనుగడకు సహకరించనుంది.