అసెంబ్లీ (Assembly) ఆమోదించిన బిల్లులకు క్లియరెన్స్ ఇవ్వడంలో జరిగిన జాప్యంపై తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi)కి సుప్రీం కోర్టు (Supreme Court) పలు ప్రశ్నలు సంధించింది. బిల్లులకు 2020లో అసెంబ్లీ ఆమోదం తెలిపిందని తెలిపింది. ఈ మూడేండ్ల కాలంలో బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ ఏం చేస్తున్నారంటూ సర్వోన్నత న్యాయ స్థానం ప్రశ్నించింది.
కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు కూడా ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయగా వాటిపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో గవర్న్‌కు పలు ప్రశ్నలు వేసింది. ఒక బిల్లును అసెంబ్లీకి తిరిగి పంపకుండా గవర్నర్ ఆమోదాన్ని నిలిపివేయగలరా?” అనే అంశాన్ని సుప్రీం కోర్టు లేవనెత్తింది. ఇది ఇలా వుంటే తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను గవర్నర్ తిప్పి పంపారు.
ఈ క్రమంలో మళ్లీ అవే బిల్లులను అసెంబ్లీ యథాతథంగా ఆమోదించింది పంపింది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ తిప్పి పంపిన బిల్లును అసెంబ్లీ మళ్లీ యతాథంగా ఆమోదించి పంపితే ఆ బిల్లును గవర్నర్ తప్పకుండా ఆమోదించాల్సి వుంటుంది. దీంతో ఇప్పుడు గవర్నర్ ఏం చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.
సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇదే వ్యాఖ్యలు చేసింది. ఆ బిల్లులను అసెంబ్లీ మళ్లీ ఆమోదించి పంపిందని తెలిపింది. ఒక బిల్లును మరోసారి ఆమోదిస్తే దానికి ఆర్థిక బిల్లులతో సమానంగా అవకాశాలు ఉంటాయని చెప్పింది. ఇప్పుడు గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దామని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 1కి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించింది.