సోషల్ మీడియా దిగ్గజ సంస్థ వాట్సాప్(WhatsApp) చేసిన ప్రకటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్(End to End Encryption) విధానాన్ని తీసివేయాల్సి వస్తే.. తాము భారత్‌లో తమ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వస్తుందని ఢిల్లీ హైకోర్టు(Delhi high Court)కు వాట్సాప్ సంస్థ తేల్చి చెప్పింది. 2021లో కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టం(New IT ACT) ప్రకారం సెక్షన్ 4(2) చట్టబద్ధం చేయడాన్ని సవాల్ చేస్తూ వాట్సాప్, ఫేస్బుక్ సంస్థలు దాఖలు చేసిన పిటీషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది.
దీనిలో భాగంగా సంస్థ తరఫు లాయర్ తమ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సందేశాల(మెసేజెస్) సేఫ్టీ కోసం ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ విధానాన్ని పాటిస్తున్నామని, దీని వలన గోప్యతకు హామీ ఉండటంతో భారతీయులు ఎక్కువగా వాడుతున్నారని కోర్టుకు వివరించారు.
ఒకవేళ సెక్షన్ 4(2)ను చట్టబద్ధం చేస్తే తాము బలవంతంగా ఎన్‌క్రిప్టెడ్‌ను బ్రేక్ చేయాల్సి వస్తుంది. అలా చేయాలని చెబితే తమ కంపెనీ భారత్‌లో సేవలు నిలిపివేయాల్సి వస్తుందని కోర్టు తెలిపారు.ఈ సెక్షన్ వ్యక్తుల గోప్యత, డేటా భద్రతకు ముప్పుగా మారింది, రాజ్యాంగ వ్యతిరేకం అని వాట్సాప్ తరఫు లాయర్ కోర్టులో వాదించారు. ఇటువంటి విధానం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇరువైపుల వాదనలు విన్న కోర్టు ఆగస్టు 14వ తేదీకి విచారణ వాయిదా వేసింది. కాగా,2021లో నూతన ఐటీ చట్టం అమల్లోకి రాగా ఈ నిబంధనలను ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్(ఎక్స్) వంటి సంస్థలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం ఆదేశించింది. అయితే, ఈ రూల్‌ను సోషల్ మీడియా సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అనంతరం పలు సంస్థలు కోర్టులను ఆశ్రయించాయి. ఈ సెక్షన్‌ను తొలగించాలని లేదంటే భావప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని ఈ సంస్థలు ఆరోపిస్తున్నాయి.