కుల గణన పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి సంతకాన్ని కులగణనపైనే చేస్తామని వెల్లడించారు. ఇది స్వాతంత్ర్యం అనంతరం తీసుకున్న అత్యంత విప్లవాత్మక నిర్ణయం (Caste census) అని ఆయన అన్నారు. ఓబీసీలు ఎంత మంది ఉన్నారన్నది బయటకు రావాలన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బేమతరా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ… దేశంలో ఓబీసీలు, దళితులు, గిరిజనుల వాస్తవ జనాభా ఎంత ఉందో తెలియాలన్నారు. వారి నిజమైన శక్తి ఏంటో వెలుగులోకి వస్తే దేశంలో గణనీయమైన మార్పు వస్తుందని అన్నారు.
జనగణన చేపడితే స్వాతంత్ర్య వచ్చిన తర్వాత తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ఇదే అవుతుందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో తమ ప్రభుత్వం ఏర్పడితే కుల గణన చేపడుతామని హామీ ఇచ్చారు. ఓబీసీలకు హక్కులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు అసలు ఓబీసీలే లేరని బీజేపీ నేతలు అంటారని ఆరోపించారు. ఓబీసీలు ఎంత మంది ఉన్నారనేది బయటకు రావాలన్నారు.
బీసీలు 10 శాతం, 20 శాతం లేదా 60 శాతం ఎంతైనా కానీ జనాభాలో బీసీల భాగస్వామ్యం చాలానే ఉందన్నారు. ప్రధాని మోడీ కుల గణన చేపట్టినా లేక పోయినా ఛత్తీస్‌గఢ్‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుల గణను చేపడుతామన్నారు. రాష్ట్రంలోని మహిళలందరికి ఆర్థిక సాయం కింద ప్రతి ఏటా రూ. 15000లను వారి అకౌంట్లలో జమ చేస్తామన్నారు. కేజీ నుంచి పీజీ వరకూ విద్యార్థులందరికీ ఉచిత విద్య అందించాలనే చారిత్రక నిర్ణయాన్ని బఘేల్ సర్కార్ తీసుకుందన్నారు.