కాంగ్రెస్ (Congress) పై ప్రధాని మోడీ (PM Modi) నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ ఎక్కడ ఉంటే అక్కడ ఉగ్రవాదం, మహిళలపై దౌర్జన్యాలు పెరిగిపోతాయన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ తన ఉదాసీన వైఖరితో సంఘ వ్యతిరేక శక్తుల పట్ల చూసీ చూడనట్టుగా వ్యవహరించి రాష్ట్రాన్ని నేరాల్లో, అల్లర్లలో మొదటి స్థానానికి తీసుకు వచ్చిందంటూ తీవ్ర స్థాయిలో మోడీ ధ్వజమెత్తారు.
భరతపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ….. జాదూగర్ ప్రభుత్వానికి మరోసారి ఓటు వేయకూడదని ప్రజలు నిర్ణయానికి వచ్చారన్నారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతుందన్నారు. మహిళలు తప్పుడు అత్యాచారం కేసులు పెడతారని సీఎం అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారని, అలాంటి వారిని మహిళలు కాపాడుతారా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రతీ పండగకు అల్లర్లు, రాళ్ల దాడులు జరగుతున్నాయన్నారు. మహిళల నమ్మకాన్ని కాంగ్రెస్ వమ్ము చేసిందన్నారు. అందువల్లే గెహ్లాట్ సర్కార్ కు ఓట్లు పడవన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడం, మహిళలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించడం తమ పార్టీ ఇచ్చే గ్యారెంటీలన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఎక్కడ ఉంటే అక్కడ ఉగ్రవాదులు, నేరగాళ్లు ఉంటారని అన్నారు.
కాంగ్రెస్ ఎప్పుడు బుజ్జగింపులు చేస్తుందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలే ఆ పార్టీకి ముఖ్యమన్నారు. దేశం ఇప్పుడు విశ్వగురువుగా ఎదుగుతోందన్నారు. కానీ రాజస్థాన్‌లో మాత్రం గత ఐదేండ్లలో అవినీతి, నేరాలు, అల్లర్లు, నేరాలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతి చోట అవినీతి, దోపిడీ జరుగుతోందన్నారు. కానీ బీజేపీ పాలనలో అభివృద్ధి జరుగుతోందన్నారు .