Telugu News » Sharmila : కాంగ్రెస్ లోకి షర్మిల.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..?

Sharmila : కాంగ్రెస్ లోకి షర్మిల.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..?

తెలంగాణలో అధికార పార్టీకి ప్రజలు భారీ షాక్ ఇవ్వడంతో ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు జగన్. ఈ క్రమంలో టికెట్ రాని నేతలు నిరసన స్వరం వినిపిస్తున్నారు. రాజీనామా బాట పట్టారు. ఆర్కే లాంటి నేతలు ఇప్పటికే షర్మిలకు టచ్ లోకి వెళ్లారు. ఇంకా చాలామంది నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

by admin
Who benefits from Sharmila joinied Congress

– హస్తం గూటికి చేరిన షర్మిల
– ఆంధ్రా కాదు అండమాన్ వెళ్లమన్నా వెళ్లానని ప్రకటన
– తెలంగాణలో మూసుకుపోయిన డోర్లు
– ఏపీ రాజకీయాల్లోకే ఎంట్రీ
– షర్మిల రాక టీడీపీకి నష్టమా? లాభమా?
– వైసీపీకి వచ్చే ఇబ్బందులేంటి..?

ఉమ్మడి ఆంధ్రాను విడగొట్టినప్పటి నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీ చతికిలపడింది. తెలంగాణ (Telangana) లో పదేళ్లకు అధికారాన్ని దక్కించుకోగా.. ఏపీ (Andhra Pradesh) లో అయితే అసలు, ఆ పార్టీ ఉందా? లేదా? అనే డౌట్ ఉంది. అయితే.. దివంగత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) కుమార్తె షర్మిల (Sharmila) ద్వారా కాంగ్రెస్ మళ్లీ యాక్టివ్ కావాలని చూస్తోంది. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆమెకు కండువా కప్పి ఆహ్వానం పలికారు. చేరిక అనంతరం షర్మిల మాట్లాడుతూ.. ఆంధ్రా కాదు అండమాన్ వెళ్లమన్నా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. చాలా రోజులుగా షర్మిల ఏపీసీసీ పగ్గాలు చేపడతారని ప్రచారం జరుగుతోంది. ఆ హామీతోనే ఆమె అందులో చేరినట్టు చెప్పుకుంటున్నారు. అయితే.. ఎన్నికల వేళ.. కాంగ్రెస్ లోకి షర్మిల రాక ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అనే చర్చ జోరుగా జరుగుతోంది.

Who benefits from Sharmila joinied Congress

తెలంగాణలో బూమరాంగ్

తెలంగాణ అభివృద్ధే లక్ష్యం అంటూ 2021 జూలై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు షర్మిల. తర్వాత పలు జిల్లాల్లో నిరుద్యోగ యాత్రలు చేశారు. అనంతరం పాదయాత్ర నిర్వహించారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే.. ఎన్నికలు దగ్గర పడిన సమయంలో అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో వైటీపీని విలీనం చేసేందుకు చర్చలు జరిపారు. అధిష్టానం ఓకే చెప్పినా.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కొందరు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిలకు ఛాన్స్ లేకుండాపోయింది. చేసేదేం లేక కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. ఆంధ్రా మూలాలున్న పార్టీలు తెలంగాణలో మనుగడ సాగించలేవని.. ప్రజలు యాక్సెప్ట్ చేయరని మరోసారి తేలిపోయింది. దీంతో ఇప్పుడు ఏపీకే పరిమితం కావాలని షర్మిల డిసైడ్ అయి ఇప్పుడు విలీనం చేశారని అంటున్నారు.

అప్పుడు అన్న కోసం.. ఇప్పుడు అన్ననే జైలుకు పంపిన పార్టీ కోసం

వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు జగన్. అయితే.. అక్రమాస్తుల కేసులో ఆయన జైలుపాలవ్వడంతో అన్నీ తానై పార్టీని నడిపించారు షర్మిల. వైసీపీ తరుఫున 2012-2013లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. జగన్ తరఫున ప్రచార బాధ్యతలు తీసుకుని ప్రజలకు మరింత చేరువయ్యారు. కానీ, 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు నేపథ్యంలో వైసీపీకి ఓటమి తప్పలేదు. 2019 ఎన్నికల్లో మాత్రం భారీ విజయం దక్కింది. అయితే.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న షర్మిలకు ఏ పదవీ దక్కలేదు. దీంతో ఆమె తెలంగాణ బాట పట్టాల్సి వచ్చింది. ఆమె వెంటే వైఎస్ భార్య విజయలక్ష్మి కూడా నడిచారు. ఇప్పుడు అన్నను జైలుకు పంపిన కాంగ్రెస్ పార్టీలోనే షర్మిల చేరడం.. ఏపీసీసీ పగ్గాలు స్వీకరిస్తారని ప్రచారం జరుగుతుండడం.. జగన్ కు భారీ దెబ్బ తగిలే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు.

వైసీపీలో భారీ కుదుపు తప్పదా?

తెలంగాణలో అధికార పార్టీకి ప్రజలు భారీ షాక్ ఇవ్వడంతో ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు జగన్. ఈ క్రమంలో టికెట్ రాని నేతలు నిరసన స్వరం వినిపిస్తున్నారు. రాజీనామా బాట పట్టారు. ఆర్కే లాంటి నేతలు ఇప్పటికే షర్మిలకు టచ్ లోకి వెళ్లారు. ఇంకా చాలామంది నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వైసీపీ ఓటు బ్యాంక్ చీలే ప్రమాదం ఉంది. నాయకులతోపాటు వాళ్ల అనుచరులు, అనుకూలమైనవాళ్ల ఓట్లు తరలిపోతాయి. అదీగాక, వైసీపీకి బలంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో చీలక తప్పదు. దీనివల్ల వైసీపీ ఓట్ బ్యాంక్ కే ప్రమాదం ఎక్కువ అని అంటున్నారు విశ్లేషకులు.

షర్మిల ఎంట్రీ టీడీపీ-జనసేనకు ప్లస్ అవుతుందా?

2014 ఎన్నికల్లో టీడీపీకి జనసేన మద్దతిచ్చి పోటీ చేయలేదు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయింది. కాకపోతే ఈసారి టీడీపీతో కలిసి జనసేన కూడా పోటీకి దిగుతోంది. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లను లెక్కేస్తే అత్యధిక స్థానాల్లో విజయం తథ్యమనే అంచనాలున్నాయి. ఇప్పుడు షర్మిల రాకతో ఆ ఓట్ల చీలిక ఉంటుందా? అనే చర్చ సాగుతుండగా.. టీడీపీ-జనసేన కూటమికి వచ్చిన నష్టమేమీ ఉండదనేది రాజకీయ పండితుల వాదన. ఇది జగన్ పార్టీకి మాత్రమే తలనొప్పి వ్యవహారంగానే మారుతుందని అంచనా వేస్తున్నారు.

You may also like

Leave a Comment