పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన (Security Breach) ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు ఆగంతకుల వద్ద ఉన్న పాస్‌లు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా జారీ చేసినట్టుగా భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా (Pratap Simha) ఎవరు.? ఆయన పొలిటికల్ కెరీర్, బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కర్ణాటకలోని మైసూర్ నియోజకవర్గం నుంచి ప్రతాప్ సింహా (42) ఎంపీగా ఉన్నారు. దివంగత ఎంపీ గోపాల్ గౌడ కుమారుడే ప్రతాప్ సింహా. మొదట్లో జర్నలిస్టుగా పని చేసేవారు. కన్నడ వార్తా పత్రికల్లో ‘నగ్న ప్రపంచం’ అనే పేరుతో కాలమ్స్ రాస్తూ ఉండే వారు. 2008లో ప్రధాని మోడీ బయోగ్రఫీని ‘నరేంద్ర మోడీ యారు తులియాదా హాది’పేరిట రచించారు.
2014లో బీజేపీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తన దైన శైలిలో హిందూత్వ రాజకీయాలతో ఫేమస్ అయ్యారు. అతి తక్కువ కాలంలోనే బీజేవైఎంకు అధ్యక్ష స్థాయికి ఎదిగారు. 2014లో మొదటి సారి మైసూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. తన ప్రత్యర్థిపై 32000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ మెంబర్ గా కూడా ఉన్నారు.
ప్రతాప్ సింహా భార్య పేరు అర్పిత. ఆయనకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. ప్రస్తుతం సింహా ఆస్తులు రూ. 1,87,23,762 కోట్లుగా ఉంది. ఆయన అప్పులు రూ. 65,86,698 ఉన్నట్టు అఫిడవిట్లో తెలిపారు. ఇది ఇలా వుంటే ఈ ఘటన నేపథ్యంలో విజిటర్స్ పాస్‌లపై నిషేధం విధిస్తున్నట్టు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు.