దేశవ్యాప్తంగా కాంగ్రెస్ (Congress) క్రౌడ్ ఫండింగ్ (Crowdfunding Drive) కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనం ఎప్పుడైతే ధనవంతుల మీద ఆధారపడతామో అప్పుడు మనం ధనవంతుల పాలసీలను ఫాలో కావాల్సి ఉంటుందని ఖర్గే అన్నారు.
మొదటి దేశం కోసం ప్రజల నుంచి కాంగ్రెస్ విరాళాలు సేకరిస్తోందని తెలిపారు. మనం ధనవంతులపై ఆధారపడి పని చేస్తే అప్పు వాళ్ల పాలసీలను ఫాలో కావాల్సి ఉంటుందని వెల్లడించారు. గతంలో స్వతంత్ర్య ఉద్యమ సమయంలో మహాత్మ గాంధీ కూడా ప్రజల నుంచి విరాళాలు సేకరించారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ 138 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ వెబ్‌సైట్‌లోని పేమెంట్ లింక్ దాతలను రూ. 138 లేదా రూ. 1380 లేదా 13,800 విరాళాలను అనుమతించనున్నారు. కావాలంటే దాతలు వేరే మొత్తాలను కూడా విరాళంగా ఇవ్వవచ్చన్నారు.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ…. 1920-21లో ప్రారంసభించిన మహాత్మా గాంధీ చారిత్రాత్మక ‘తిలక్ స్వరాజ్ ఫండ్’ నుండి స్ఫూర్తి పొంది ఈ క్రౌడ్ ఫండింగ్ మొదలు పెట్టామని వెల్లడించారు.
కాంగ్రెస్ చేపట్టిన క్రౌడ్ ఫండింగ్‌పై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. 60 ఏండ్లుగా దేశాన్ని దోచుకున్న పార్టీ ఇప్పుడు విరాళాలివ్వాలంటున్నారని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ ఇంట్లో దొరికిన నోట్ల కట్టల వ్యవహారం నుంచి దేశం దృష్టి మరల్చేందుకే ఆ పార్టీ ఇలాంటి పనులు చేస్తోందని మండిపడింది. ప్రజా ధనాన్ని గాంధీ కుటుంబానికి సమర్పించేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారంటు ఫైర్ అయింది.