ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టు అయ్యి ప్రస్తుతం తిహార్(TIHAR) జైలులో ఖైదీగా ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్(CM Kejiriwal) భవితవ్యం నేడు తేలనుంది. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఆయన ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని, తనపై మోపిన అభియోగాలు అన్నీనిరాధారమైనవని పేర్కొంటూ తన రిమాండ్ క్యాన్సిల్ చేయాలని కేజ్రీవాల్ కోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలోనే దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ మంగళవారం మధ్యాహ్నం 2.30కు తన తీర్పును వెల్లడించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ పరువుకు భంగం కలిగేలా కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన తరఫు లాయర్ కోర్టుకు వివరించారు.
అయితే, ఈడీ తరఫు న్యాయవాదులు కూడా ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్రపై, ఇప్పటికే ఆ కేసులో అరెస్టై జైలులో ఉన్న నిందితుల వాంగ్మూలం మేరకు ఢిల్లీ సీఎంను అరెస్టు చేసినట్లు వాదనలు వినిపించింది.
ఇరు పక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.కాగా, కేజ్రీవాల్‌ను ఢిల్లీ సీఎం పీఠం నుంచి తప్పించాలని ఆప్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇలాంటి పిటిషన్ మళ్లీ వేయరాదని వార్నింగ్ ఇచ్చింది. అయితే, హైకోర్టు కేజ్రీవాల్ రిమాండ్ క్యాన్సిల్ చేసి బెయిల్ తప్పక ఇస్తుందని ఆప్ వర్గాలు, నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.